
ఎకానమీ క్లాస్‌లో మాంసాహారం బంద్
న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.
‘గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు’ అని సంబంధిత అధికారి చెప్పారు. కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.