‘వినియోగ’ నిపుణుడికి నోబెల్
బ్రిటన్-అమెరికన్‌కు ఆర్థిక శాస్త్ర పురస్కారం
పేదరికం, సంక్షేమం, వినియోగాంశాలపై అధ్యయనానికి..
స్టాక్‌హోం (స్వీడన్): పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో మార్పుకు, ఆర్థికశాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘‘పేదరికాన్ని తగ్గించి సంక్షేమాన్ని ప్రోత్సహించేలా ఆర్థిక విధానాలను రూపొందించాలంటే తొలుత వ్యక్తిగత వినియోగ అభిరుచుల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని అర్థాన్ని అందరికంటే ఎక్కువగా డేటన్ వివరించారు’’ అని అకాడమీ కితాబిచ్చింది.
1980లో తన సహచర ఆర్థికవేత్త జాన్ మల్‌బార్‌తో కలసి వివిధ వస్తువులకు ఉండే డిమాండ్‌ను అంచనా వేసినందుకు, 1990లో వినియోగం, ఆదాయానికి మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం చేసినందుకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవన ప్రమాణాలను కొలిచేందుకు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఇంటింటి సర్వేల ద్వారా ఆయన సాగించిన అధ్యయనాలకుగాను డేటన్‌ను ఈ గౌరవానికి ఎంపిక చేసింది. డేటన్ 1983 నుంచి అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర, అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అవార్డు కింద ఆయనకు సుమారు రూ.6.15 కోట్ల నగదు అందనుంది.