పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్
దావోస్: ఓ బాలిక తనకు రాసిని ఉత్తరంలో భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ గుర్తు చేసుకుంది. బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా త్వరలోనే భారత పర్యటనకు వస్తానని ప్రకటించింది. 15 ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్‌లో బాలిక విద్య కోసం పోరాడుతున్న క్రమంలో ఆమెపై ఉగ్రమూకలు హత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ వేదికగా బాలికల సమస్యలపై పోరాడుతోంది. గుల్‌మకాయ్ పేరుతో సంస్థను స్థాపించి బాలిక విద్య కోసం నిధులు సేకరిస్తోంది.
ఇందులోభాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లోనూ పాల్గొంది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి గ్రహీత మీడియాతో మాట్లాడింది. తన సంస్థ గుల్‌మకాయ్ విస్తరణ కోసం ఇండియాలో పర్యటించాలని అనుకుంటున్నానని మలాలా వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు ఉత్తరాలు రాసి తన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారిచ్చే ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేమని కొనియాడింది.
పాకిస్తాన్ ప్రధానినవుతా!
తనకు భారత్ అంటే చాలా ఇష్టమని మలాలా చెప్పింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని తెలిపింది. తనకు ఉత్తరం రాసిన ఓ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని గుర్తు చేసుకుంది. ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని చెప్పింది. నేటి బాలికల ఉన్నత ఆశయాలకు ఈ ఉత్తరమే నిదర్శనమని ప్రశంసించింది. తాను కూడా పాకిస్తాన్‌కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాలోని బాలికల కోసం కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘‘భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువద్దు. కేవలం వారికి విద్యనందిస్తే సరిపోదు, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment