ఇక ఏటీఎంలో పిజ్జాలు
ఆఖలేస్తే పిజ్జా కార్నర్ ఎక్కడ ఉందా..? అని ఇక వెతుకోవాల్సినవసరం లేదు. జేబులో ఏటీఎం కార్డు ఉంటే చాలు. ఏటీఎం నుంచే పిజ్జాను పొంది, ఎంచకా అక్కడే తినేయొచ్చట. ఉత్తర అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను ఓహియో యూనివర్సిటీలో ఆవిష్కరించారు. పిజ్జా ప్రియులకు సౌకర్యార్థం, సిన్సినాటిలోని జేవియర్ యూనివర్సిటీ(ఎక్స్యూ), ఫ్రెంచ్ కంపెనీ పాలైన్ భాగస్వామ్యంతో నార్త్ అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను తమ కాలేజ్ ఆవరణలో ఏర్పాటుచేసింది.
ఎక్స్యూ డైనింగ్ హాల్కు బయట, ఫెన్విక్ స్థలంలో దీన్ని ఇన్ స్టాల్ చేశారు. ఈ ఏటీఎంలో 70 పిజ్జాల వరకు అందుబాటులో ఉంటాయని ఫ్రెంచ్ కంపెనీ చెబుతోంది.. కస్టమర్లు టచ్ స్క్రీన్ ఉపయోగించి, ఈ ఏటీఎం నుంచి పిజ్జాను పొందవచ్చని తెలిపింది. కస్టమర్ పిజ్జాను ఆర్డర్ చేసిన వెంటనే ఈ మిషన్ కొద్దిసేపు పాటు పిజ్జాను వేడిచేసి, అనంతరం స్లాట్ నుంచి కస్టమర్లకు అందిస్తోందని పాలైన్ కంపెనీ చెప్పింది.
నార్త్ అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను ప్రారంభించినట్టు జేవియర్ కాలేజ్ డైనింగ్ హాల్ కూడా ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఈ ఏటీఎం నుంచి మొదటి పిజ్జా జేవియర్ మహిళల సాసర్ టీమ్కు సర్వ్ చేసినట్టు తెలిపింది. ఏటీఎం మొదటి పిజ్జాను ఎంజాయ్ చేసిన సాసర్ టీమ్ కూడా తమ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గత 14 ఏళ్లుగా యూరప్లో పాలైన్ సంస్థ పిజ్జా ఏటీఎం సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.