ఒకనాటి కోల్ మైన్.. నేటి బ్యాంక్ ఆఫ్ గ్రెయిన్
ఫొటో చూడగానే అబ్బో ఇదో కొత్త భవనమా? ఎక్కడ కడుతున్నారో అనుకుంటున్నారు కదూ? కానీ ఇది ఎప్పుడో కట్టేసిన భవనం. కాకపోతే చాలా డిఫరెంట్. ఉత్తర ధ్రువప్రాంతంలోని స్వాల్‌బార్డ్ ప్రాంతంలో ఉండే భారీ భవంతి ఇది. ఫొటోలో మీరు చూస్తున్నది ఓ కొండను తొలుచుకుని కనిపిస్తున్న చిన్న భాగం మాత్రమే. కొండలోపల ఒకప్పటి బొగ్గుగని రూపంలో బోలెడంత స్థలం ఉంది. ఏంటి దీని ప్రత్యేకత అంటున్నారా? దీన్ని డూమ్స్‌డే వాల్ట్ అంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా, ఏదైనా కారణం చేత భూమ్మీద పంటలకు భారీ నష్టం జరిగిందనుకోండి.. మళ్లీ ఆ పంటల్ని పండించుకునేందుకు వీలుగా ఇక్కడ విత్తనాలు భద్రపరుస్తారన్నమాట!
దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ఇక్కడ విత్తనాలను నిక్షిప్తం చేశాయి. ఇంతకీ ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? భారత్‌తోపాటు యూకే, అమెరికా, బెనిన్, బెలారస్, పాకిస్థాన్, మెక్సికో, లెబనాన్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి దాదాపు 50 వేల విత్తన నమూనాలు తాజాగా ఈ వాల్ట్‌లోకి వచ్చి చేరాయి. ఈ విత్తన బ్యాంకులో మొత్తమ్మీద 45 లక్షల వేర్వేరు పంటల విత్తనాలను నిల్వ చేసేందుకు ఏర్పాట్లు ఉండగా, ఇప్పటివరకూ దాదాపు 9,30,000 రకాలు వచ్చి చేరాయి. బంగాళాదుంపలు, గోధుమ, జొన్న, వరి, పెసర, బార్లీ, శనగ వంటి అనేక పంటల విత్తనాలు దీంట్లో ఉన్నాయి. విత్తనాలన్నింటినీ మూడు పొరల ప్లాస్టిక్ సంచుల్లో అతిశీతల పరిస్థితుల్లో అంటే – 18 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు.
ధ్రువ ప్రాంతంలో దట్టమైన మంచు అడుగుభాగాన ఉండటం వల్ల ఈ విత్తనాలు దీర్ఘకాలం పాటు చెడిపోకుండా ఉంటాయని అంచనా. రెండేళ్ల క్రితం సిరియాలోని అలెప్పోలో తీవ్రమైన యుద్ధం జరిగినప్పుడు అక్కడ కొన్ని పంటలకు తీవ్రనష్టం జరిగింది. దీంతో అక్కడి పరిశోధన సంస్థలు స్వాల్‌బార్డ్ విత్తన బ్యాంకు నుంచి తమ విత్తనాలు కొన్నింటిని ఉపసంహరించుకుని మళ్లీ పంటలను అభివృద్ధి చేసుకున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్