Global Seed Vault
-
గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్ హామీ ఇచ్చారు. ప్రపంచ ఆహార సదస్సు–2018లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎమ్మె ల్యే సీహెచ్ రమేశ్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు జర్మనీ వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం జర్మనీ విత్తన ప్రముఖులతో అక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్లోవిక్నర్ తెలంగాణ రాష్ట్రం విత్తన ధ్రువీకరణ కింద పలు దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయడాన్ని అభినందించారు. తెలంగాణను గ్లోబల్ సీడ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో గ్లోబల్ సీడ్ అడ్వయిజరీ బాడీ, ఇండో–జర్మన్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్‌కు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్మనీ–తెలంగాణ మధ్య ఉన్న ఇండో–జర్మన్ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం.. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పంపిన లేఖను క్లోవిక్నర్కు ఎమ్మెల్యే రమేశ్, డాక్టర్ కేశవులు అందజేశారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్ ఆ లేఖలో ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆసియాలోనే మొదటిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, విత్తన శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ప్రపంచ ఆహార సదస్సుకు కొన్ని కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం దిశగా తెలంగాణ పయనిస్తున్న సమయంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్, విత్తన ఎగుమతికి సహకరిస్తున్న ఇండో–జర్మన్ ప్రాజెక్టు నిర్వహకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఒకనాటి కోల్ మైన్.. నేటి బ్యాంక్ ఆఫ్ గ్రెయిన్
ఫొటో చూడగానే అబ్బో ఇదో కొత్త భవనమా? ఎక్కడ కడుతున్నారో అనుకుంటున్నారు కదూ? కానీ ఇది ఎప్పుడో కట్టేసిన భవనం. కాకపోతే చాలా డిఫరెంట్. ఉత్తర ధ్రువప్రాంతంలోని స్వాల్బార్డ్ ప్రాంతంలో ఉండే భారీ భవంతి ఇది. ఫొటోలో మీరు చూస్తున్నది ఓ కొండను తొలుచుకుని కనిపిస్తున్న చిన్న భాగం మాత్రమే. కొండలోపల ఒకప్పటి బొగ్గుగని రూపంలో బోలెడంత స్థలం ఉంది. ఏంటి దీని ప్రత్యేకత అంటున్నారా? దీన్ని డూమ్స్‌డే వాల్ట్ అంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా, ఏదైనా కారణం చేత భూమ్మీద పంటలకు భారీ నష్టం జరిగిందనుకోండి.. మళ్లీ ఆ పంటల్ని పండించుకునేందుకు వీలుగా ఇక్కడ విత్తనాలు భద్రపరుస్తారన్నమాట! దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ఇక్కడ విత్తనాలను నిక్షిప్తం చేశాయి. ఇంతకీ ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? భారత్‌తోపాటు యూకే, అమెరికా, బెనిన్, బెలారస్, పాకిస్థాన్, మెక్సికో, లెబనాన్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి దాదాపు 50 వేల విత్తన నమూనాలు తాజాగా ఈ వాల్ట్‌లోకి వచ్చి చేరాయి. ఈ విత్తన బ్యాంకులో మొత్తమ్మీద 45 లక్షల వేర్వేరు పంటల విత్తనాలను నిల్వ చేసేందుకు ఏర్పాట్లు ఉండగా, ఇప్పటివరకూ దాదాపు 9,30,000 రకాలు వచ్చి చేరాయి. బంగాళాదుంపలు, గోధుమ, జొన్న, వరి, పెసర, బార్లీ, శనగ వంటి అనేక పంటల విత్తనాలు దీంట్లో ఉన్నాయి. విత్తనాలన్నింటినీ మూడు పొరల ప్లాస్టిక్ సంచుల్లో అతిశీతల పరిస్థితుల్లో అంటే – 18 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు. ధ్రువ ప్రాంతంలో దట్టమైన మంచు అడుగుభాగాన ఉండటం వల్ల ఈ విత్తనాలు దీర్ఘకాలం పాటు చెడిపోకుండా ఉంటాయని అంచనా. రెండేళ్ల క్రితం సిరియాలోని అలెప్పోలో తీవ్రమైన యుద్ధం జరిగినప్పుడు అక్కడ కొన్ని పంటలకు తీవ్రనష్టం జరిగింది. దీంతో అక్కడి పరిశోధన సంస్థలు స్వాల్బార్డ్ విత్తన బ్యాంకు నుంచి తమ విత్తనాలు కొన్నింటిని ఉపసంహరించుకుని మళ్లీ పంటలను అభివృద్ధి చేసుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్