బిడ్డను కంటే.. ఆరు నెలల సెలవు!
మాతృత్వ ప్రయోజనాల చట్టంలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, ఇప్పటివరకు బిడ్డను కన్న మహిళలకు మూడు నెలల సెలవు మాత్రమే ఇస్తుండగా, దాన్ని ఆరు నెలలకు పెంచారు. ఆ ఆరు నెలల పాటు ఆమె ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా, పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోడానికి అంత సమయం అవసరమని చెబుతున్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది.
దీనివల్ల వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న దాదాపు 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చట్ట సవరణలో ఇద్దరు పిల్లల వరకు అయితే ఆరు నెలలు, అంతకంటే మించితే మాత్రం మూడు నెలల సెలవు ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు బిడ్డను దత్తత తీసుకున్నవాళ్లకు కూడా మూడు నెలల సెలవు ఇస్తారు. 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలలో తప్పనిసరిగా పిల్లల సంరక్షణ కోసం క్రెష్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్ట సవరణలో పేర్కొన్నారు.