తైవాన్ మ్యూజిక్ పార్టీలో అగ్నిప్రమాదం
519 మందికి గాయాలు
తైపీ: తైవాన్ రాజధాని తైపీలోని ఓ వాటర్ పార్కులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ‘కలర్ ప్లే ఏసియా’ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద నుంచి నిర్వాహకులు విసిరిన ఒక రకమైన రంగుల పొడి ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీసింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సుమారు వెయ్యి మందిలో 519 మంది కాలిన గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. వారిలో 419 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వారిలో 184 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితుల్లో తైవాన్ జాతీయులతోపాటు హాంగ్‌కాంగ్ నుంచి నలుగురు, చైనా నుంచి ఇద్దరు, మకావు, జపాన్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని వివరించారు. బాధితులను దేశాధ్యక్షుడు మా యింగ్-జియో ఆదివారం పరామర్శించారు. వారికి అత్యుత్తమ వైద్య సాయం అందేలా చూస్తామన్నారు.
అలాగే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని , దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో రంగుల పొడి వాడకంతో సాగే కార్యక్రమాలపై ప్రధాని చిహ్-కువో గతంలోనే నిషేధం విధించారు.