ఒబామాకు ఓ స్పెషల్ జాబ్ ఆఫర్!
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎనిమిదేళ్ల పదవీకాలం ముగియబోతున్నది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా.. ఓ స్పెషల్ జాబ్ ఆఫర్ వచ్చింది.
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ స్పోటిఫై కేవలం ఒబామా కోసమే ఒక ప్రత్యేక ఉద్యోగ ప్రకటన చేసింది. 'ప్రెసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్' పేరిట ప్రకటించిన ఈ ఉద్యోగం కోసం కనీసం ఎనిమిదేళ్లు అత్యున్నతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉండాలి అని షరతు పెట్టింది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు కొనసాగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి నోబెల్ శాంతిగ్రహీత అయి ఉండాలని పేర్కొంది. ఒబామాకు 2009లో ఈ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.
కళాకారులు, సంగీతకారులతో విస్తృత సంబంధాలు ఉండాలి. అలాగే మీ పుట్టినరోజు వేడుకకు కెండ్రిక్ లామర్ సంగీత ప్రదర్శన ఇప్పించి ఉంటే మరీ మంచిది. అంతేకాదు ప్రెస్ మీట్లలో ఇష్టంగా మాట్లాడాలి. అన్ని వేళల్లో గొప్ప వక్తగా ఉండాలి' అంటూ అర్హతల చిట్టా విప్పింది. ఈ అర్హతలన్నీ ఒబామాకు ఉన్న సంగతి తెలిసిందే. ఒబామా గతంలో స్పోటిఫైలో కొన్ని మ్యూజిక్ ప్లేలిస్ట్ లు రూపొందించారు. ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత తనకు తప్పకుండా స్పోటిఫై నుంచి జాబ్ ఆఫర్ వస్తుందని ఒబామా ఇటీవల ఛలోక్తులు విసిరారు. అన్నట్టుగానే ఆయన కోసమే ఈ ఉద్యోగ ప్రకటనను స్పోటిఫై సీఈవో డానియెల్ ఎక్ సోమవారం ట్వీట్ చేశారు.