వాషింగ్టన్: అంగారకుడిపై ఒకప్పుడు జీవించడానికి అనుకూలమైన మంచినీరు ఉండేదని నాసాకు చెందిన ఆపర్చునిటీ రోవర్ గుర్తించింది. ఇక్కడి రాళ్ల నమూనాలను పరిశీలించగా.. దాదాపు నాలుగు వందల కోట్ల ఏళ్ల కింద మంచినీరు విస్తృతంగా ఉండేదని వెల్లడైనట్లు నాసా ప్రకటించింది. ఇది ఇంతకు ముందు ‘ఆపర్చునిటీ’ రోవర్ గుర్తించిన ఆమ్లయుత వాతావరణ పరిస్థితికి ముందటి స్థితి అని పేర్కొంది. అంగారక గ్రహాన్ని పైనుంచి తీసిన చిత్రాల్లో గమనించిన లోయలు, ప్రవాహాల గుర్తుల ఆధారంగా భారీగా నీరు ఉన్నట్లు ఇంతకుముందే అంచనా వేశామని.. ప్రస్తుతం రోవర్ నీరు ఉండేదని స్పష్టం చేసిందని కార్నెల్ వర్సిటీ ప్రొఫెసర్ పౌలో డిసౌజా తెలిపారు. అంగారకుడిపై జీవం ఉండేందుకు అనుకూలమైన నీరు ఉండేదని కచ్చితంగా గుర్తించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఒకవేళ అక్కడ జీవం ఉండి ఉంటే.. త్వరలోనే వెల్లడవుతుందని పేర్కొన్నారు.