
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని మళ్లీ ఉల్లంఘిస్తూ జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)వెంబటి ఉన్న 10 సరిహద్దు కేంద్రాలు, జనావాసాలపై పాకిస్తాన్ దళాలు భారీస్థాయిలో మోర్టార్ దాడులు, కాల్పులకు దిగాయి. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా పాక్ దళాలు జరిపిన ఈ కాల్పు ల్లో ఆర్నియా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక సహా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోగా 34 మంది గాయాల పాలయ్యారు. ఐబీకి 4 కిమీల దూరంలోని ఆర్నియా బస్టాండ్‌లోనూ మోర్టార్ షెల్స్ కనిపించాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయని సరిహద్దు రక్షణ దళం అధికార ప్రతినిధి వెల్లడించారు. పాక్ కాల్పులకు భారత సైన్యం కూడా దీటుగా స్పందిస్తోందన్నారు. పాక్ దుశ్చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది.
ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు సమాధానమిచ్చేందుకు భారతదళాలు సంసిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. భారత్‌లో పరిస్థితులు మారాయన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకుని.. ఈ దుశ్చర్యలను ఆపేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నించి భంగపడిన ప్రతీసారి నిస్పృహకు లోనై పాక్ కాల్పులకు దిగుతోందం టూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. శ్రీనగర్‌లో ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఒమర్ అబ్దుల్లా జమ్మూ చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల అంత్యక్రియలకు హాజరయ్యారు. జనావాసాలపై పాక్ కాల్పులను ఒమర్ తీవ్రంగా ఖండించారు. బాధిత ప్రాంతాలు కొన్నిటిని సందర్శించిన పీటీఐ ప్రతినిధికి రక్తం మరకలతో కూడిన మంచాలు, చిల్లులు పడిన ఇళ్ల పైకప్పులు, బుల్లెట్లతో రంధ్రాలు పడిన కిటికీలు కన్పించారుు. మోర్టార్ బాంబుల ముక్కలు కూడా చెల్లాచెదురుగా పడి కన్పించారుు. పాక్ మళ్లీ దాడులకు తెగబడవచ్చుననే భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలావుండగా పూంచ్ జిల్లా భింబేర్ గాలి ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి స్థావరాలపై కూడా పాక్ సైన్యం సోమవారం ఉదయం 8.30 ప్రాంతంలో మోర్టార్ దాడులకు, కాల్పులకు పాల్పడినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. పాక్ ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా కాంగ్రెస్, బీజేపీలు పేర్కొన్నారుు. పాక్ ఈ విధమైన ఉల్లంఘనలకు పాల్పడటం గత నాలుగు రోజుల్లోనే ఇది పదకొండోసారి. కాగా, భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేసింది.