'అణుబాంబ్'ను వరించిన భలే అదృష్టం!
మొన్నటివరకు అతను ఇస్లామాబాద్‌లో ఓ మామూలు చాయ్‌వాలా! నిన్నటికినిన్న భారత్‌పై పాకిస్థాన్ 'అణుబాంబ్' ఇతడే అంటూ ట్విట్టర్‌లో హల్‌చల్ చేశాడు. ఈ రోజు ఏకంగా భారీ మోడలింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాకు వేవేల ధన్యవాదాలు చెప్తూ ఉండాలి.
రెండుమూడు రోజుల కిందటి వరకు ఇస్లామాబాద్‌లోని ఇత్వార్ బజార్‌లో చాయ్ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్ ఖాన్ అదృష్టం రెండురోజుల్లోనే అనూహ్యంగా మారిపోయింది. తన ప్రమేయం లేకుండానే అతడు ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యాడు. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అతని ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టగా.. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో చాయ్‌వాలా (#ChaiWala) హ్యాష్‌ట్యాగ్ పాకిస్థాన్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్ స్థానంలో నిలిచింది.
అలా అర్షద్ ఖాన్ దశ తిరిగిపోయి.. ఫిటిఇన్.పీకే ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్‌కు మోడలింగ్ చేసే అవకాశం అతన్ని వరించింది. చాయ్‌వాలా ఇప్పుడు తన కెరీర్‌ను మార్చుకొని.. ఫ్యాషన్‌వాలాగా మారిపోయాడని ఫిటిఇన్.పీకే సంస్థ తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపింది. కోటు, సూటు ధరించిన అతని ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
ఇక, 17మంది తోబుట్టవుల్లో ఒకరైన అర్షద్ తాను ఇంతగా ఫేమస్ కావడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇప్పటివరకు 35 నుంచి 50 మంది మహిళలతో తనతో సెల్ఫీలు, వీడియోలు తీసుకొని వెళ్లారని, తాను ఇంతగా పాపులర్ కావడం ఆనందం కలిగిస్తున్నదని 18 ఏళ్ల అర్షద్ తెలిపాడు. మోడలింగ్ ఓకే చెప్పిన అతను భవిష్యత్తులో సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని చెప్తున్నాడు.