పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా..
పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కశ్మీర్ వ్యాలీలో రంగం సిద్ధమవుతోందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురవేయడానికి వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్లు వ్యూహాలు రచించినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ ఇన్ పుట్స్ నేపథ్యంలో పాక్ డే సంబరాలను అడ్డుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రజలను సంబరాల్లో పాల్గొనకుండా చేయడం వల్ల పౌరులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా ఇంటిలిజెన్స్ అధికారులను హెచ్చరించింది.
సపోర్ నుంచి వాట్లాబ్, బందిపొర వరకూ దాదాపు 25 ప్రదేశాల్లో ఇనుప పైపులు, కర్రలతో జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ తెలిపింది. సపోర్-దొవాబ్గాహ్-రఫియాబాద్ మార్గంలో 20 ప్రదేశాల్లో, పుల్వామా, సపోర్, అనంతనాగ్ లలో మరికొన్ని చోట్ల పాక్ జెండాలను ఎగురవేసేందుకు పక్కాప్రణాళిక రూపొందిందని తన రిపోర్టులో పేర్కొంది. రూరల్ కశ్మీర్ లో ప్రొ-పాకిస్తానీ ర్యాలీలు భారత్ కు తలనొప్పిగా మారాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదేశాలు జారీ చేశారు.