'మేకను దొంగిలించాడని చేతులు నరికేశాడు'
లాహోర్: తన మేకను దొంగిలించాడనే నెపంతో పదేళ్ల బాలుడి రెండు చేతులు నరికేశాడో కిరాతక భూస్వామి. పాకిస్థాన్ లోని పంబాబ్ ప్రావిన్స్ లోని చోటుచేసుకున్న ఈ ఘటన మానవతావాదులందరినీ కదలించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెషన్స్ కోర్టు అతడికి 10 రోజుల రిమాండ్ విధించింది. లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ జిల్లా చాక్బోలు గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
భూస్వామి ముస్తాఫా గౌసఫ్ తన కొడుకు తబస్సుమ్ చేతులను తెగే వరకు పంపింగ్ మిషన్ పెట్టాడని బాలుడి తండ్రి నాసిర్ ఇక్బాల్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఈనెల 21 తన కొడుకును ఎత్తుకుపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వాపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారుడిని రోడ్డుపై వదిలేసి పారిపోయాడని చెప్పాడు.
ఈ ఘనట గురించి మీడియా రావడంతో పంజాబ్ సీఎం షహబాజ్ షరీష్ స్పందించారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తబస్సుమ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతడిని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తన మేకను దొంగిలించిన తబస్సుమ్ కు గుణపాఠం చెప్పాలనే అతడి చేతులను ఖండించినట్టు పోలీసులతో ముస్తఫా చెప్పాడు. అతడిపై హత్యాచారం కింద కేసు నమోదు చేశారు.