ఢిల్లీలో పాకిస్థాన్‌ పిల్లిమొగ్గలు! | Pakistan sent junior officials to a Saarc meeting in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పాకిస్థాన్‌ పిల్లిమొగ్గలు!

Published Thu, Sep 22 2016 3:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ఢిల్లీలో పాకిస్థాన్‌ పిల్లిమొగ్గలు!

ఢిల్లీలో పాకిస్థాన్‌ పిల్లిమొగ్గలు!

న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ న్యూఢిల్లీలో పిల్లిమొగ్గలు వేసేందుకు ప్రయత్నించింది. ఢిల్లీలో జరుగుతున్న సార్క్‌ సదస్సుకు కేవలం జూనియర్‌ స్థాయి అధికారులను పంపించి.. భారత్‌ను చిన్నబుచ్చే ప్రయత్నం చేసింది. 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ దౌత్యపరంగా ఏకాకిని చేయాలని భారత్‌ నిర్ణయించడంతోపాటు, ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా సాగుతున్న నేపథ్యంలో పాక్‌ ఈ చర్యకు పాల్పడింది.

దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో  సార్క్‌కు చెందిన అత్యున్నత నిపుణుల బృందం ఢిల్లీలో రెండురోజుల సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు పాకిస్థాన్‌ సీనియర్‌ దౌత్యవేత్తలను కాకుండా కౌన్సెలర్‌ స్థాయి జూనియర్‌ అధికారులను పంపించి ఈ సదస్సుకు పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్టు వ్యవహరించింది. సార్క్‌ సదస్సును అవమానించేలా పాకిస్థాన్‌ తీరు ఉండటం గమనార్హం.

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్‌)లో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్, మల్దీవులు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ దినేశ్వర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు పాకిస్థాన్ మినహా అన్ని దేశాలు సీనియర్‌ దౌత్యవేత్తలను పంపించాయి. పాక్‌ నుంచి ఈ సదస్సుకు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌ స్థాయి అధికారి హాజరుకావాల్సి ఉండగా ఇద్దరు జూనియర్లను ఆ స్థానంలో పంపించి.. దురుసుగా వ్యవహరించింది. సార్క్‌ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగం ఏమేరకు పనిచేస్తున్నదో సమీక్షించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement