మోదీపైనా ప్రతీకారం తీర్చుకుంటాం | Pakistan Taliban now issues direct threat to Indian PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీపైనా ప్రతీకారం తీర్చుకుంటాం

Published Wed, Nov 5 2014 3:45 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

నరేంద్ర మోదీ(ఫైల్) - Sakshi

నరేంద్ర మోదీ(ఫైల్)

పాకిస్థాన్ తాలిబాన్లు ఏకంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీనే లక్ష్యంగా చేసుకున్నారు.

తాలిబన్ల హెచ్చరిక
 మా తదుపరి లక్ష్యం భారత్
 వాఘా తరహాలోనే భారత్‌లోనూ దాడులు
 సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తం
 
 పెషావర్: వాఘా సరిహద్దులో ఆత్మాహుతి దాడితో మారణహోమం సృష్టించిన తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ జమాత్ అహ్రార్ (టీటీపీ-జేఏ) ఉగ్రవాద సంస్థ బరితెగింపు వ్యాఖ్యలు చేసింది. తమ తదుపరి లక్ష్యం భారతదేశమేనని పాక్ తాలిబన్ సంస్థ ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ ప్రకటించాడు. ప్రధాని నరేంద్ర మోదీపైన కూడా పగతీర్చుకుంటామని చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో భారత, పాకిస్థాన్ సరిహద్దు వెంబడి సైన్యాన్ని భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తం చేశాయి. ప్రధాని భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని, ఏ ఉగ్రవాద సంస్థా ప్రధానికి ముప్పు తలపెట్టజాలదని  ఢిల్లీలో అధికారవర్గాలు స్పష్టంచేశాయి.

కేవలం సంచలనంకోసమే టీ టీపీ ప్రధాని లక్ష్యంగా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులో పాకిస్థాన్ వైపు వాఘావద్ద ఆదివారంనాటి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వాఘావద్ద దాడికి తామే బాధ్యులమని టీటీపీ ప్రకటించింది. రాయ్‌టర్స్ వార్తా సంస్థతో రహస్య ప్రాంతం నుంచి  తాలిబన్ ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ ఫోన్లో మాట్లాడుతూ తాజా హెచ్చరిక చేశాడు. సరిహద్దులో ఒకవైపున ఆత్మాహుతి దాడి చేయగలిగిన తమకు మరోవైపున ఇండియాలో కూడా దాడి చేయడం కష్టం కాదని, భారత్‌పైనా దాడి చేయబోతున్నామని ఇప్పటికే భారత ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పాడు.

ఇదే సమయంలో కాశ్మీర్ వేర్పాటువాదులు, గుజరాత్‌కు చెందిన అమాయకుల రక్తంతో చేతులు తడుపుకున్న మోదీ కూడా పరిహారం చెల్లించాలని హెచ్చరించామన్నాడు. మోదీపైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎహ్‌సాన్ అంతకు ముందు ట్విట్టర్లోపర్కొన్నాడు. ఆ ట్విట్టర్ ఖాతా నిజమైనదేనని భారత నిఘా అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా, తాము పాక్ దళాల లక్ష్యంగానే సరిహద్దులో దాడి చేశామని, దానిని విజయవంతంగా పూర్తిచేసినందుకు గర్వంగా ఉందని రాయ్‌టర్స్‌తో ఎహ్‌సాన్ చెప్పాడు. అంతర్జాతీయ జీహాదీ ఎజెండా ఉన్న తమకు అరబ్, పాశ్చాత్య దేశాలతో పాటు ప్రపంచమంతా సానుభూతిపరులున్నారని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఐఎస్‌ఐస్‌కు తన మద్దతు తెలిపాడు.

ఉగ్రవాద సంస్థ లక్ష్యం స్పష్టం: టీటీపీ ఉగ్రవాద సంస్థ హెచ్చరికల గురించి భద్రతా సలహాదారులు ప్రధానికి వివరించారు. భారత్‌ను ఆ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా ఎంచుకుందనే విషయం వాఘా సరిహద్దులో ఆత్మాహుతి దాడితో స్పష్టమైందని  నిఘా అధికారులు ఢిల్లీలో తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికలతో మంగళవారం కోల్‌కతా పోర్టు నుంచి రెండు యుద్ధ నౌకలను ఉపసంహరించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement