
ఇస్లామాబాద్ ముట్టడికి ముందే.. అనూహ్య చర్యలు!
భారీ ఆందోళనకు సన్నద్ధమవుతున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌ను, ఆయన అనుచరులను ముందే అదుపులోకి తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది
వచ్చేనెల రెండో తేదీన ‘ఇస్లామాబాద్ ముట్టడి’ పేరుతో భారీ ఆందోళనకు సన్నద్ధమవుతున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌ను, ఆయన అనుచరులను ముందే అదుపులోకి తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన సీనియర్ నేతలను హౌస్ అరెస్టు చేసి.. నిర్బంధించాలని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు పాక్ మీడియా తెలిపింది.
నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైనా ఆయన బాధ్యత వహించకపోవడం, కశ్మీర్ విషయంలో ఆయన నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతూ ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ రోజున లక్షలాది మందితో రాజధానిని పూర్తిగా స్తంభింపజేసి తమ సత్తా చాటుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ ఆందోళనతో పరిస్థితులు చేయి దాటిపోతాయని భావిస్తున్న షరీఫ్ ప్రభుత్వం.. ఎలాగైనా ఈ ముట్టడిని భగ్నం చేయాలని నిర్ణయించిందని, ఇందులోభాగంగా ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఆ పార్టీ చెందిన సీనియర్ నేతలను అరెస్టు చేసి నిర్బంధించనున్నారని, ఇందుకోసం సీనియర్ నేతల జాబితాను కూడా సిద్ధం చేసిందని పాక్‌కు చెందిన ‘ద న్యూస్’ పత్రిక తెలిపింది. అయితే, ముందస్తు అరెస్టు వార్తలపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ప్రభుత్వ బెదిరింపు చర్యలకు భయపడబోమని, దేనికైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. రాజ్యాంగబద్ధమైన మా హక్కును కాలారాసి ఆందోళనను అడ్డుకోవాలని చూస్తే.. అప్పుడు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పనామా పత్రాల విషయంలో నవాజ్ షరీఫ్ రాజీనామా చేయకపోవడంతో ఈ ఆందోళన చేపడుతున్నామని పీటీఐ నేతలు చెప్తున్నారు.