కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పాలకులు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వేదికపైనా కశ్మీరీలకు అండగా నిలుస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. కశ్మీర్ దినం(ఫిబ్రవరి 5) సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ఏడు దశాబ్దాలుగా స్వయం పాలన కోసం పోరాడుతున్న కశ్మీరీలను భారత్ అణచివేస్తోందని ఆరోపించారు.
కశ్మీర్ సోదరీసోదరులకు పాకిస్థాన్ పౌరులు అండగా నిలబడతారని తెలిపారు. ఎటువంటి సమయంలోనైనా కశ్మీరీలకు దన్నుగా నిలుస్తామన్నారు. కశ్మీర్ అంశం సమసిపోని వివాదమని పేర్కొన్నారు. ఉప ఖండం విభజనలో కశ్మీర్ సమస్య అసమగ్ర అజెండగా ఉందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పౌరులకు ఎల్లప్పుడూ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తామని మమ్నూన్ హుస్సేన్ తెలిపారు.