Mamnoon Hussain
-
సెప్టెంబర్ 4న పాక్ అధ్యక్ష ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈనెల 27 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని, 30న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. ప్రస్తుత అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పదవీకాలం వచ్చే నెల ముగియనుంది. పాకిస్తాన్ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో పార్లమెంట్ సభ్యులు, దేశంలోని వివిధ ప్రావిన్సుల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. భారత్‌లాగే, పాకిస్తాన్‌లోనూ ప్రధాని సిఫారసు మేరకే అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటారు. పాక్ ప్రధాని ఎన్నిక నేడే: పాక్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి నేషనల్ అసెంబ్లీ శుక్రవారం సమావేశం కానుంది. కాగా, ప్రధాని అభ్యర్థిగా పీఎమ్ఎల్ఎన్ తరఫున షహబాజ్ షరీఫ్, పీటీఐ తరఫున ఇమ్రాన్‌ఖాన్ వేసిన నామినేషన్లను స్పీకర్ ఆమోదించారు. ఓటింగ్ తర్వాత ఎన్నికైన అభ్యర్థి శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. -
పాకిస్తాన్లో మొగిన ఎన్నికల నగారా
-
పాకిస్తాన్లో ఎన్నికల నగారా
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. జూలై 25న దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ రాసిన లేఖకు అధ్యక్షుడు స్పందించారు. జూలై 25న ఎన్నికల నిర్వహణకు ఆయన అనుమతినిచ్చారు. ఆ దేశ నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే దేశ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ పదవీ గడువు మే 31తో ముగియనుండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా 105 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పాలకులు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వేదికపైనా కశ్మీరీలకు అండగా నిలుస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. కశ్మీర్ దినం(ఫిబ్రవరి 5) సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ఏడు దశాబ్దాలుగా స్వయం పాలన కోసం పోరాడుతున్న కశ్మీరీలను భారత్ అణచివేస్తోందని ఆరోపించారు. కశ్మీర్ సోదరీసోదరులకు పాకిస్థాన్ పౌరులు అండగా నిలబడతారని తెలిపారు. ఎటువంటి సమయంలోనైనా కశ్మీరీలకు దన్నుగా నిలుస్తామన్నారు. కశ్మీర్ అంశం సమసిపోని వివాదమని పేర్కొన్నారు. ఉప ఖండం విభజనలో కశ్మీర్ సమస్య అసమగ్ర అజెండగా ఉందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పౌరులకు ఎల్లప్పుడూ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తామని మమ్నూన్ హుస్సేన్ తెలిపారు. -
'వాలెంటైన్స్ డేను బహిష్కరించండి'
ఇస్లామాబాద్: వాలెంటైన్స్ డే వేడుకలను బహిష్కరించాలని పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వాలెంటైన్స్ డే అన్నది పాక్ సంస్కృతి కాదని, ఇది పాశ్చాత్య దేశాల సంప్రదాయమని పేర్కొన్నారు. పాక్ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ అబ్దూర్ నిష్టార్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులనుద్దేశించి పాక్ అధ్యక్షుడు ప్రసంగించారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిని అనుసరించడం, మన విలువలను అగౌరవపరచడమేనని చెప్పారు. గొప్ప నాయకుల సిద్ధాంతాలను పాటించడం వల్లే దేశం పురోగతి చెందుతుందని అన్నారు. కాగా పెషావర్, కొహట్ జిల్లాలో వాలెంటైన్స్ డే వేడుకలను స్థానిక కౌన్సిల్ నిషేధించింది. ఈ రోజున (ఫిబ్రవరి 14) గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని కొహట్ జిల్లా కౌన్సిల్ చైర్మన్ మౌలానా నియాజ్ మహమ్మద్ చెప్పారు. వాలెంటైన్స్ వేడుకలు చేసుకోవడాన్ని ఇస్లాం మతపెద్దలు వ్యతిరేకిస్తున్నారు. -
అధ్యక్షుడి కొడుకే టార్గెట్
కరాచీ: పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కుమారుడికి ప్రాణ గండం తప్పింది. అతడి కుమారుడు సల్మాన్ మమ్నూన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా.. 13 మందికిపైగా గాయాలపాలయ్యారు. సల్మాన్‌కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లో రిమాట్ ద్వారా ఉగ్రవాదులు ఈ చర్యకు దిగారు. 'ఓ మోటారు సైకిల్‌పై భారీ పేలుడు పదార్థాలు అమర్చి సల్మాన్ వెళ్లే దారిలోని ఓ రెస్టారెంట్ వద్ద ఉంచారు. ఆయన నిర్వహించే పలు వ్యాపారా లావాదేవీలకోసం ఆ మార్గం నుంచే వెళతారని వారు ఊహించి ఈ ఘటనకు దిగారు' అని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి. -
'పాక్ నుంచి ఆ భూతాన్ని తరిమేస్తాం'
ఉగ్రవాదుల దాడుల కారణంగా ఏడేళ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న పాక్ సైనిక బలగాలు సోమవారం 'పాకిస్థాన్ పరేడ్ డే'ని ఘనంగా నిర్వహించాయి. టెర్రరిస్టులతో పోరాటంలో దేశం యావత్తు ఒక్కటయిందని, టెర్రర్ భూతాన్ని పాక్ నుంచి తరిమేస్తామని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రధాన వేడుకలో పాల్గొన్న ఆయన.. తాము భారత్‌తో స్నేహ సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లయితే ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో పోరులో అమరులైన వీర జవాన్లతోపాటు పెషావర్ మృతులకూ నివాళులు అర్పించిన మమ్నూన్.. తాలిబన్ల వేటకోసం పైన్యం అనుసరిస్తున్న 'జర్బ్ ఏ అజబ్' విధానాన్ని ప్రశంసించారు. 1947లో స్వాతంత్ర్యం పొందిన నాటినుంచి పాక్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందని, ప్రధాని నవాజ్ షరీఫ్ వాటిని పరిష్కరించగల సమర్ధుడేనని అన్నారు. -
సెప్టెంబర్ 9న పాక్ దేశాధ్యక్షుడిగా మమ్నూన్ ప్రమాణం
పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ సెప్టెంబర్ 9వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈవాన్ - ఐ- సర్ద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మమ్నూన్ చేత పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మొహమ్మద్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలిపింది. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడిగా ఉన్న అసిఫ్ అలీ జర్దారీ పదవికాలం సెప్టెంబర్ 8వ తేదీతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ దేశాధ్యక్ష పదవికి మమ్నూన్ హుస్సేన్ ఎన్నికైయ్యారు. దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, విదేశీ రాయబారులతోపాటు పలువురు ప్రముఖులు దేశాధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరువుతారని స్థానిక మీడియా ప్రచురించిన కథనంలో వెల్లడించింది.