
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈనెల 27 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని, 30న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. ప్రస్తుత అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పదవీకాలం వచ్చే నెల ముగియనుంది. పాకిస్తాన్ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో పార్లమెంట్ సభ్యులు, దేశంలోని వివిధ ప్రావిన్సుల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. భారత్‌లాగే, పాకిస్తాన్‌లోనూ ప్రధాని సిఫారసు మేరకే అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటారు.
పాక్ ప్రధాని ఎన్నిక నేడే:
పాక్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి నేషనల్ అసెంబ్లీ శుక్రవారం సమావేశం కానుంది. కాగా, ప్రధాని అభ్యర్థిగా పీఎమ్‌ఎల్‌ఎన్ తరఫున షహబాజ్ షరీఫ్, పీటీఐ తరఫున ఇమ్రాన్‌ఖాన్ వేసిన నామినేషన్లను స్పీకర్ ఆమోదించారు. ఓటింగ్ తర్వాత ఎన్నికైన అభ్యర్థి శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు.