ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2024లో జరగబోయే పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ పాకిస్తాన్ ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ స్వస్థలమైన మియాన్వాలి నుంచి ఆయన పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక ఆయన అధికార రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడినందుకే నామినేషన్‌ను తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకస్తాన్ లెక్కల ప్రకారం.. 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 28, 626 మంది తమ నామినేషన్లను దాఖలు చేసిట్లు పేర్కొంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో జైల్లో ఉన్నాడని.. పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పీటీఐ పార్టీ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. కాగా.. సాధరాణ ఎన్నికల సమయంలో తనను జైలులోనే ఉంచడానికి తనపై తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment