'వాలెంటైన్స్ డేను బహిష్కరించండి'
ఇస్లామాబాద్: వాలెంటైన్స్ డే వేడుకలను బహిష్కరించాలని పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వాలెంటైన్స్ డే అన్నది పాక్ సంస్కృతి కాదని, ఇది పాశ్చాత్య దేశాల సంప్రదాయమని పేర్కొన్నారు.
పాక్ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ అబ్దూర్ నిష్టార్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులనుద్దేశించి పాక్ అధ్యక్షుడు ప్రసంగించారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిని అనుసరించడం, మన విలువలను అగౌరవపరచడమేనని చెప్పారు. గొప్ప నాయకుల సిద్ధాంతాలను పాటించడం వల్లే దేశం పురోగతి చెందుతుందని అన్నారు. కాగా పెషావర్, కొహట్ జిల్లాలో వాలెంటైన్స్ డే వేడుకలను స్థానిక కౌన్సిల్ నిషేధించింది. ఈ రోజున (ఫిబ్రవరి 14) గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని కొహట్ జిల్లా కౌన్సిల్ చైర్మన్ మౌలానా నియాజ్ మహమ్మద్ చెప్పారు. వాలెంటైన్స్ వేడుకలు చేసుకోవడాన్ని ఇస్లాం మతపెద్దలు వ్యతిరేకిస్తున్నారు.