
లైవ్‌లో మహిళా జర్నలిస్టు చెంప ఛెళ్లు..!
లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. ఓ పోలీసు అధికారి మహిళా జర్నలిస్టు చెంప ఛెళ్లుమనిపించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌కు చెందిన కే-21 చానెల్ మహిళా జర్నలిస్టు సైమా కన్వాల్ కరాచీ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
పాకిస్థాన్ జాతీయ సమాచార, రిజిస్ట్రేషన్ సంస్థ కార్యాలయం వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సైమా లైవ్ రిపోర్టింగ్ అందిస్తుండగా పోలీసు అధికారి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రజలతోనే కాకుండా ఏకంగా మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా వ్యవహరించాడు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న కెమెరామ్యాన్‌పై దాడి చేశాడు. దీంతో అసహనానికి లోనైన రిపోర్టర్ సైమా.. ‘మీడియాతోనే అతను ఇలా ప్రవర్తిస్తుంటే.. ఇంకా సామాన్యులతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు’ అని పేర్కొంది. ఆ దురుసు అధికారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. అతడు లైవ్ ప్రసారంలోనే సైమా చెంప చెళ్లుమనిపించాడు. అంతేకాకుండా అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఏకంగా గాలిలోకి 18రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో సదరు పోలీసు అధికారిపై స్థానికంగా కేసు నమోదైంది.