పాక్ తాలిబన్ చీఫ్ హతం
పెషావర్/ఇస్లామాబాద్: ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంపై అమెరికా ద్రోన్ విమానం జరిపిన దాడిలో పాకిస్థాన్ తాలిబన్ అధినేత హకీముల్లా మెహసూద్ మరణించినట్లు ఆ దేశ మీడియా శుక్రవారం రాత్రి వెల్లడించింది. మెహసూద్ సహా మొత్తం ఆరుగురు ఈ దాడిలో మరణించినట్లు పేర్కొంది. దాండే దర్పఖేల్ ప్రాంతంలోని ఓ ఆవరణ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పాక్ ఇంటిలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది.
రెండు క్షిపణులు ఢీకొట్టడంతో ఆవరణ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాకిస్థాన్ తాలిబన్ల సమావేశం జరుగుతోందని ఆ కథనం వివరించింది. ఈ ఆవరణను మెహసూద్ తరచు ఉపయోగిస్తుంటాడని సమాచారం. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కు నేతృత్వం వహిస్తున్న మెహసూద్‌తో పాటు మెహసూద్ బంధువు, వ్యక్తిగత బాడీగార్డ్ అయిన తారిక్ మెహసూద్, డ్రైవర్ అబ్దుల్లా మెహసూద్ మరణించినవారిలో ఉన్నారు. భద్రతా దళాలను ఉటంకిస్తూ జియో న్యూస్ కూడా మెహసూద్ మరణ వార్తను ప్రకటించింది.
అనంతరం తాలిబన్ వర్గాలు కూడా మెహసూద్ మృతిని ధ్రువీకరించాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మిరాన్షా ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపాయి. తాలిబాన్, ఆల్ కాయిదా అగ్ర నాయకత్వానికి తగులుతున్న వరుస ఎదురుదెబ్బల్లో ఇది తాజా సంఘటన అవుతుందని భావిస్తున్నారు. అమెరికా ద్రోన్‌లు పాక్ గిరిజన ప్రాంతం లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతున్న సంగతి విదితమే. తాజా దాడి అనంతరం పరిణామాలపై పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తోనూ, ఇతర రాజకీయ నేతలతోనూ చర్చించారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
గత నెలలో షరీఫ్ అమెరికా పర్యటన అనంతరం ద్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన షరీఫ్ సీఐఏ ప్రేరేపిత ద్రోన్ దాడుల గురించి ప్రస్తావించారు. దాడులు నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో టీటీపీ డిప్యూటీ చీఫ్ లతీఫ్ మెహసూద్‌ను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకున్న తర్వాత కొద్దిరోజులకే తాజా దాడి జరగడం విశేషం. బాంబులు, ఆత్మాహుతి దాడులతో టీటీపీ పాక్ దళాలపై విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ దాడుల్లో మరణించారు. మెహసూద్‌కు ముందు టీటీపీ చీఫ్‌గా వ్యవహరించిన బైతుల్లా మెహసూద్ కూడా ద్రోన్ దాడిలోనే మరణించాడు. బైతుల్లా మరణానంతరం 2009లో హకీముల్లా టీటీపీ పగ్గాలు చేపట్టాడు.