హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మొదటి ముద్దాయి, ఇంజనీరింగ్ విద్యార్థి అయిన శ్రావెల్ కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న శ్రావెల్.. బెయిల్ కోసం నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని బెయిల్ విజ్ఞప్తిని కొట్టివేస్తూ న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రావెల్ గతంలోనూ పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. (రమ్యని తాగేశారు)
జులై ఒకటో తేదీన శ్రావెల్, అతని స్నేహితులు తప్పతాగి, కారును అతివేగంగా నడపడంతో పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నాటి విషాదఘటనలో ఎనిమిదేళ్ల రమ్య కుటుంబం చిన్నాభిన్నమైంది. (వెంటాడుతున్న విషాదం) రమ్య బాబాయి రాజేష్ అక్కడిక్కడే మృతిచెందగా, 9 రోజులుగా రమ్య మృత్యువుతో పోరాడి మృతిచెందింది. రమ్య తల్లి, తాతయ్య ఆసుపత్రి పాలయ్యారు. కొద్ది రోజుల తర్వాత రమ్య తాతయ్య చికిత్స పొందుతూ మరణించారు. (రమ్య మృతి బాధాకరం, నిందితుడికి కఠినశిక్ష : సీపీ)