ధర్మ యుద్ధానికి ఆద్యుడెవరో తెలుసా ?
టీనగర్: జయలలిత ద్వారా రెండు సార్లు ముఖ్యమంత్రిగా నియమించబడిన తనకు ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పేర్కొంటున్న జయకుమార్‌కు ఇంతటి అహంకారం పనికిరాదని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. దిండుగల్ జిల్లా, అన్నాడీఎంకే పురట్చి తలైవి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవం, కార్యకర్తల సమావేశం దిండుగల్ బస్టాండ్ సమీపంలోగల స్పెన్సర్ కాంపౌండ్‌లో జరిగింది. మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, మాజీ మంత్రులు పొన్నయన్, సెమ్మలై, కేపీ మునుసామి, కె.పాండ్యరాజన్, పీహెచ్ పాండియన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ఎంజీఆర్ మృతి తర్వాత జయలలిత ఒకటిన్నర కోటిమంది కార్యకర్తలు కలిగిన కంచుకోటగా అన్నాడీఎంకేను మార్చారన్నారు. ఆమె మృతి తర్వాత అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ వర్గం ప్రయత్నించడంతో తాము ధర్మయుద్ధాన్ని ప్రారంభించామన్నారు. ఈ ధర్మయుద్ధానికి ఆద్యుడు మాజీ మంత్రి మునుసామి అని తెలిపారు. జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరపాల్సిందిగా అనేక సార్లు కోరామని, అయితే ఎడపాడి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇందుకు సమ్మతం తెలపకుండా అనేక నాటకాలు ఆడుతున్నట్లు విమర్శించారు.