అమరీందర్ ఆఫర్ కు నో చెప్పిన బాదల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కొత్త ఇల్లు చూసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని చండీగఢ్ లో ఉచితంగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని నూతంగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ కు సరైన బంగ్లా కేటాయిస్తామని అమరీందర్ సింగ్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
'ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంచి మనసుకు కృతజ్ఞుడిని. ఆయన ప్రతిపాదన చాలా బాగుంది. కానీ నేను సొంతంగా నివాస ఏర్పాట్లు చేసుకుంటున్నాన'ని బాదల్ అన్నారు. ఇప్పటివరకు చండీగఢ్ టోనీ సెక్టార్ 8లో ముఖ్యమంత్రి బంగ్లాలో ఆయన నివాసం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో అధికారిక నివాసాన్ని ఆయన ఖాళీ చేశారు. సెక్టార్ 9లో బాదల్ కుటుంబానికి 1.5 ఎకరాల నివాస స్థలం ఉంది.