మా జీతాలు, భత్యాలు రెట్టింపు చేయండి
ఎంపీల జీత భత్యాలన్నింటినీ దాదాపు రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే మాజీ ఎంపీల పింఛనును 75 శాతం పెంచాలని తెలిపింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నియమించిన ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి...
- ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేయాలి.
- మాజీ ఎంపీలకు పింఛను ఇప్పుడు నెలకు రూ. 20 వేలు ఉండగా, దాన్ని రూ. 35 వేలు చేయాలి.
- పార్లమెంటు సమావేశాల సమయంలో సభకు హాజరైనందుకు ఇప్పుడు రోజుకు రూ. 2వేలు ఇస్తుండగా, దాన్ని రూ. 4వేలకు పెంచాలి.
- మాజీ ఎంపీలతో పాటు వాళ్ల భార్యలకు కూడా రైళ్లలో ఫస్ట్ క్లాస్లో వెళ్లేందుకు అనుమతించాలి.
- విమానాల ఎకానమీ క్లాస్లో మాజీ ఎంపీలను ఏడాదికి ఐదుసార్లు వెళ్లనివ్వాలి.
- ఎంపీలు కేబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ ర్యాంకులో ఉంటారు కాబట్టి, వాళ్ల స్థాయికి తగ్గట్లు గౌరవ మర్యాదలు కల్పించాలి.
- ఎంపీల పిల్లలకు పెళ్లిళ్లు అయినా, వాళ్లకు కూడా ఉచిత వైద్య సదుపాయాలు అందించాలి.
ఈ ప్రతిపాదనలలో కొన్నింటిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఇప్పటికే సమర్పించారు. మరికొన్నింటిని జూలై 13న జరిగే సమావేశంలో ఖరారు చేస్తారు. చిట్టచివరిసారిగా 2010లో ఎంపీల జీత భత్యాలను సవరించారు. ఇప్పుడు ఒకసారి సవరిస్తే, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరిస్తారు.