mps salaries hike
-
మీకిదే ఆఖరి ఛాన్స్: కేంద్రంపై సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల విషయానికి సంబంధించి శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. వారంలోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. గతంలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా 2017 సెప్టెంబర్ 1న త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో ఈ విషయంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 'భారత ప్రభుత్వ విధానం బలమైనది. దాన్ని మీరు ప్రతి రోజు ఎప్పుడంటే అప్పుడు మార్చలేరు' అని కేంద్రం తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది అజిత్ సిన్హాను అత్యున్నత ధర్మాసనం మందలించింది. 'మీరు చెప్పినట్లుగా మీరు నడుచుకోలేదు. మీరు 2017లో ఇచ్చిన అఫిడవిట్లో శాశ్వత మెకానిజానికి సంబంధించి స్పష్టంగా లేదు. మీరు ఎప్పుడు ఆ పని పూర్తి చేయనున్నారు.. అసలు దానిపై ప్రభుత్వ వ్యూహాం ఏమిటి? అసలు ఆ విధానం కావాలనుకుంటున్నారా? వద్దని అనుకుంటున్నారా? మీరు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో సంతృప్తికరమైన వివరణ ఏదీ లేదు. మాకు ఇప్పుడు చెప్పడానికి మీ దగ్గర ఒక్క మాట లేకపోవచ్చు.. కానీ మీకు మాత్రం బహుశా ఇదే చివరి అవకాశం' అని కోర్టు హెచ్చరించింది. -
మా జీతాలు, భత్యాలు రెట్టింపు చేయండి
ఎంపీల జీత భత్యాలన్నింటినీ దాదాపు రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే మాజీ ఎంపీల పింఛనును 75 శాతం పెంచాలని తెలిపింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నియమించిన ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి... ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేయాలి. మాజీ ఎంపీలకు పింఛను ఇప్పుడు నెలకు రూ. 20 వేలు ఉండగా, దాన్ని రూ. 35 వేలు చేయాలి. పార్లమెంటు సమావేశాల సమయంలో సభకు హాజరైనందుకు ఇప్పుడు రోజుకు రూ. 2వేలు ఇస్తుండగా, దాన్ని రూ. 4వేలకు పెంచాలి. మాజీ ఎంపీలతో పాటు వాళ్ల భార్యలకు కూడా రైళ్లలో ఫస్ట్ క్లాస్‌లో వెళ్లేందుకు అనుమతించాలి. విమానాల ఎకానమీ క్లాస్‌లో మాజీ ఎంపీలను ఏడాదికి ఐదుసార్లు వెళ్లనివ్వాలి. ఎంపీలు కేబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ ర్యాంకులో ఉంటారు కాబట్టి, వాళ్ల స్థాయికి తగ్గట్లు గౌరవ మర్యాదలు కల్పించాలి. ఎంపీల పిల్లలకు పెళ్లిళ్లు అయినా, వాళ్లకు కూడా ఉచిత వైద్య సదుపాయాలు అందించాలి. ఈ ప్రతిపాదనలలో కొన్నింటిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఇప్పటికే సమర్పించారు. మరికొన్నింటిని జూలై 13న జరిగే సమావేశంలో ఖరారు చేస్తారు. చిట్టచివరిసారిగా 2010లో ఎంపీల జీత భత్యాలను సవరించారు. ఇప్పుడు ఒకసారి సవరిస్తే, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరిస్తారు.