రెండు వారాల సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత లోక్‌సభలో చర్చలు సజావుగా సాగాయి. ఇటీవల వరుస సెలవుల నేపథ్యంలో శనివారం సైతం పార్లమెంటు పనిచేసింది.
న్యూఢిల్లీ: రెండు వారాల సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత లోక్‌సభలో చర్చలు సజావుగా సాగాయి. ఇటీవల వరుస సెలవుల నేపథ్యంలో శనివారం సైతం పార్లమెంటు పనిచేసింది. సాయంత్రం 6 గంటల లోగా మూడు బిల్లులను ఆమోదించింది. వీటిలో గవర్నర్లకు పదవీ విరమణ తర్వాత కూడా సౌకర్యాలు, అలవెన్సులు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు, ఐదు రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో మార్పు చేర్పులకు ఉద్దేశించిన బిల్లు, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో మార్పు చేర్పులకు ఉద్దేశించిన బిల్లులు ఉన్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5న మొదలైన నాటి నుంచి తెలంగాణ సహా పలు అంశాలపై ఉభయ సభల్లోనూ రాద్ధాంతం కొనసాగడంతో, తరచు వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్పీకర్ మీరాకుమార్ కఠినంగా వ్యవహరించి సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలను శుక్రవారం సస్పెండ్ చేయడంతో పరిస్థితి చక్కబడింది. కాగా, యూపీలో వీహెచ్‌పీ యాత్ర నేపథ్యంలో బీజేపీ, సంఘ్‌పరివార్‌లపై శనివారం లోక్‌సభలో ఆర్‌జేడీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా విమర్శల దాడికి దిగాయి. వీహెచ్‌పీ యాత్ర దేశంలో మతసామరస్యానికి మంచిది కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ జీరో అవర్‌లో ఆర్‌జేడీ సభ్యుడు ప్రభునాథ్ సింగ్ కేంద్రాన్ని కోరారు. యాత్రకు మద్దతు తెలిపే పార్టీల గుర్తింపు రద్దుచేయాలన్నారు. దీనికి ఎస్పీ సభ్యుడు శైలేంద్రకుమార్ కూడా మద్దతు తెలిపారు.