పార్టీ ఎన్నికల గుర్తుల ప్రాధాన్య కథ | parties and symbols | Sakshi
Sakshi News home page

పార్టీ ఎన్నికల గుర్తుల ప్రాధాన్య కథ

Published Fri, Jan 6 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

parties and symbols

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పార్టీపై పట్టుకోసమే కాకుండా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తయిన ‘సైకిల్‌’ కోసం కూడా తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌పై యుద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల కమిషన్‌ కోర్టులో ఉంది. మరోపక్క తండ్రీ, తనయుల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ అంటే హస్తం, భారతీయ జనతా పార్టీ అంటే కమలం, సమాజ్‌వాది పార్టీ అంటే సైకిల్, బహుజన సమాజ్‌వాది పార్టీ అంటే ఏనుగు గుర్తులు గుర్తొస్థాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా చదువురాని వారు తాము ఓటే వేయాలనుకున్న అభ్యర్థి పేరు వేళకు గుర్తురాకపోయినా, గుర్తునుబట్టి గుడ్డిగా ఓటు వేస్తారు. ఇలా పార్టీకి, ఎన్నికల గుర్తుకు విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. పార్టీలు చీలిపోయిన సందర్భాల్లో ఇంతటి ప్రాధాన్యం గల ఎన్నికల గుర్తులను కోల్పోయేందుకు ఏ వర్గమూ ఇష్టపడదు. అందుకనే ఎన్నికల కమిషన్‌ ముందు, అవసరమైన న్యాయస్థానాల ముందు ఈ వర్గాలు గుర్తుకోసం పోరాటం చేస్తాయి. సహజంగా మెజారిటీ వర్గం ఏ వర్గంవైపుందో ఆ వర్గానికే ఎన్నికల కమిషన్‌ ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది. బలాబలాలను స్పష్టంగా తేల్చలేని సందిగ్ధ సమయాల్లో పార్టీ గుర్తును పక్కన పెట్టి జాబితాలో ఏ పార్టీకి కేటాయించని కొత్త గుర్తులను కేటాయిస్తుంది.

అసలు ఈ గుర్తుల విధానం ఎలా వచ్చింది?



అమెరికా లాంటి దేశంలో ఏనుగు, గాడిద గుర్తులు పార్టీ లోగోల నుంచి. కార్టూన్‌ల ప్రచారం నుంచి పుట్టుకురాగా మనకు నిరక్షరాస్యత కారణంగా పుట్టుకొచ్చాయి. స్వతంత్య్ర భారత దేశంలో 1951–52లో తొలి ఎన్నికలు జరిగిన నాటికి దేశంలో దాదాపు 80 శాతం మంది నిరక్షరాస్యులున్నారు. మనకంటే ఏడాది తర్వాత స్వాతంత్య్రాన్ని సాధించినప్పటికీ ఒకప్పటి సిలోన్, నేటి శ్రీలంకలో మనకన్నా ముందే ఎన్నికల గుర్తులతో ఎన్నికలు జరిగాయి. అలాంటి గుర్తులను మనం కూడా వాడితే నిరక్షరాస్యులకు సులభంగా ఉంటుందని అప్పటి భారత నాయకులు భావించారు.

పెన్నులుగానీ, స్టాంపులుగానీ ఉపయోగించేవారు కాదు...

నాడు శ్రీలంకలో ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించేవారు. కానీ ఆ గుర్తులకు ఓటేసినట్లు పెన్నుతో టిక్‌ కొట్టడంగానీ, ఎన్నికల స్టాంప్‌ కొట్టడంగానీ ఉండేది కాదు. ఓటర్లకు బ్యాలెట్‌ పత్రాలను ఇచ్చే వారు. పోలింగ్‌ బాక్సులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల గుర్తులు ఉండేవి. ఓటర్లు తమ బ్యాలెట్‌ పత్రాలను తీసుకెళ్లి ఏ గుర్తుగల బాక్స్‌లో వేస్తే ఆ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థికి వేసినట్లుగా ఎన్నికల అధికారులు పరిగణించేవారు. తర్వాత లంకలోను, భారత్‌లోనూ రాజకీయ పార్టీలు పెరిగిపోవడం, స్వతంత్య్ర అభ్యర్థులు పెరిగిపోవడం వల్ల బ్యాలెట్‌ పత్రాలపైనే ఓటు వేసే విధానం పుట్టుకుచ్చింది. సాంకేతికాభివద్ధి కారణంగా నేడు  ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వచ్చాయి.

ఎన్నికల గుర్తులుగా వ్యవసాయ పరికరాలు...



 నాగలి, కాటెద్దులు, కోళ్లు, మేకలు, ఇతర జంతువులు ఎన్నికల గుర్తులుగా వచ్చాయి. నాగలి, కాటెద్దుల గుర్తుల కోసం పార్టీల మధ్య పోటీ పెరగడంతో వాటిని ఎన్నికల కమిషన్‌ అధికారులు ఆ తర్వాత పక్కన పెట్టారు. జంతువులను గుర్తులుగా పొందిన పార్టీలు వాటిని బోన్లో బంధించి ర్యాలీల్లో తిప్పేవారు. వన్యప్రాణి ప్రేమికులు జీవ హింసంటూ గొడవలు చేయడంతో అప్పటి నుంచి ఎన్నికల కమిషన్‌ జంతువుల గుర్తులను ఎవరికి కేటాయించడం లేదు. ప్రస్తుతానికి మానవ అంగమైన హస్తం కాంగ్రెస్‌కు, జంతువైన ఏనుగు ఒక్క బహుజన సమాజ్‌ పార్టీకే మిగిలాయి.

టేబుల్‌ ఫ్యాన్, సీలింగ్‌ ప్యాన్, లేడీ పర్సు, నేల్‌ కట్టర్, క్యారమ్‌ బోర్డు, టీ కేటిల్, ప్రెషర్‌ కుక్కర్, జగ్గు, మగ్గు, అల్మారా, ఏర్‌ కండీషనర్, టార్చిలైట్, బ్యాట్, బాల్, పిల్లల గౌను ఇలా ఇళ్లలో కళ్లముందు కనిపించే వస్తువులన్నీ ఎన్నికల గుర్తులుగా మారిపోయాయి. ఎనవలప్‌ కవరు, వడబోత జాలి, గాలి బుడగ, ప్లేట్లు పెట్టుకునే ట్రే, క్యారెట్, కాలీఫ్లవర్, ఐస్‌క్రీమ్‌ లాంటి ఫన్నీ పేర్లు కూడా వచ్చాయి. తమ గుర్తులకు కాస్త పరమార్థం కూడా కనిపించాలని పార్టీలు కోరుకోవడం, ఆ దిశగా ఎన్నికల అధికారులు కూడా ఆలోచించడం వల్ల సైకిల్, రెండాకులు, గడ్డిపూల్‌ ఇలా కొత్త గుర్తులు వచ్చాయి. ఎన్నికల కమిషన్‌ ఏ ఉద్దేశం ఇచ్చినా తణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తన ఎన్నికల గుర్తు ‘గడ్డిపూలు (గ్రాస్‌ ఫ్లవర్స్‌)’ను గ్రాస్‌ రూట్స్‌లోకి చొచ్చుకుపోయిన పార్టీగా చెప్పుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement