కొత్త చట్టం.. ఫాలో కాకుంటే కష్టం!
ముంబై: బయట ఉమ్మేసేముందు ముంబై వాసులు ఇకనుంచి వెనుకాముందు చూసుకోవాల్పిందే. వీధుల్లో ఉమ్మేస్తూ దొరికితే జరిమానా తప్పదు. అంతేకాదు సామాజిక సేవ కూడా చేయాల్సివుంటుంది. యాంటి స్పిట్టంగ్ లాను మహారాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. దేశంలో ఈ చట్టాన్ని ప్రదేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
తాజాగా ఆమోదించిన చట్టం ప్రకారం వీధుల్లో ఉమ్మేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారు. దీంతో పాటు ఒక రోజు పాటు ప్రభుత్వాసుపత్రులు లేదా కార్యాలయాల్లో సామాజిక సేవ చేయాలి. రెండోసారి దొరికితే రూ.3000 జరిమానా, మూడు రోజుల పాటు కమ్యూనిటీ సర్వీసు చేయాల్సివుంటుంది. మరోసారి ఇదేవిధంగా పట్టుబడితే రూ.5000 జరిమానా, ఐదు రోజుల పాటు సామాజిక సేవ చేయాలి. జరిమానా విధించగా వచ్చిన మొత్తాన్ని వైద్యసేవలకు వినియోగిస్తారు.