
ఎకరా రూ. 19.21 కోట్లు
- హైదరాబాద్‌లో భూమికి రికార్డు ధర
- టీఎస్‌ఐఐసీ నుంచి 12 ఎకరాల కొనుగోలుకు ‘ఐకియా’ అంగీకారం
- నాలెడ్జ్ సిటీలోని నాలుగు ప్లాట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజధానిలో ‘రియల్’ బూమ్ మళ్లీ మొదలైంది! ఎకరా భూమి ఏకంగా రూ. 19.21 కోట్లు పలికిం ది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్తబ్దుగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.. రాష్ర్ట విభజన తర్వాత కూడా ఆశించినస్థాయిలో మెరుగవలేదన్న అభిప్రాయం నెల కొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ధర పలకడం విశేషం.
ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు స్వీడిష్ ఫర్నిచర్ తయారీ సంస్థ ‘ఐకియా’ ముందుకురావడం చర్చనీయాంశమైంది. వ్యాపార విస్తరణలో భాగంగా ‘ఐకియా ఇండియా’ పేరుతో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రాయదుర్గం సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలో వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఎస్‌ఐఐసీ)తో ఐకియా ఇండియా ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఎకరాకురూ. 19.21 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ లెక్కన నాలెడ్జ్ సిటీలో దాదాపు 12.35 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని ఐకియా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఐకియా ఎండీ జ్యూవెన్షియో మాజ్టూ, సీఎఫ్‌వో ప్రీట్ దూపర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
రూ. 500 కోట్ల పెట్టుబడి: వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 12,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో 25 స్టోర్స్ ఏర్పాటు చేయాలని ఐకియా నిర్ణయించింది. తొలిదశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రంతో హైదరాబాద్‌లో 500 మందికి ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ర్ట విభజనతో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల క్రయవిక్రయాలు మందగించిన నేపథ్యంలో ఐకియా తాజా ఒప్పందం రియల్ బూమ్‌కు నాంది పలికింది. గతంలో ఏపీఐఐసీ గానీ, హుడా గానీ హైదరాబాద్ పరిసరాల్లో విక్రయించిన భూములకు ఎకరా ధర రూ. 14 కోట్లు దాటలేదు. ఇప్పుడు అంతకన్నా చాలా ఎక్కువ ధర పలకడంతో దీన్ని మార్పునకు సంకేతంగా వ్యాపారులు పేర్కొంటున్నారు.