
అవినీతికి పాల్పడితే విమానం నుంచి తోసేస్తా
మనీలా: అవినీతి, మాదక ద్రవ్యాలపై యుద్ధాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ మరో సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని మనీలా నుంచి విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి దాని నుంచి కిందకుతోసి చంపేస్తానని హెచ్చరించారు. గతంలో తాను ఓసారి అలా చేశానని కూడా చెప్పారు. ఒకసారి అలా చేసిన వాడికి రెండోసారి అలా చేయడం పెద్ద కష్టమేమి కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల దేశాన్ని కుదిపేసిన తుపాను బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డూటర్టీ మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేసినట్లు దేశాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్ వెల్లడిస్తోంది. అయితే ఆ తర్వాత ఏబీఎస్–సీబీఎన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను చేసిన ఈ హెచ్చరికను ఖండించారు. ‘నేను అలా అన్నానా? నేను విమానం నుంచి ఒకరిని తోసి చంపేయగలనా’ అంటూ త్రోసి పుచ్చారు. ఆయన చేసిన హెచ్చరికలో ఉద్దేశాన్ని తీసుకోవాలేగానీ, యథాతథంగా వ్యాఖ్యల సారాంశాన్ని కాదని కూడా ఆయన కార్యాలయం సమర్థించింది.
గత మే నెలలో దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డూటర్టీ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వాటిని ఆయనే ఖండించడం ఆయనకు మామూలు విషయం అయిపోయింది. ఓసారి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతూ తాను దవావో మేయర్‌గా ఉన్నప్పుడు అమ్మాయిని కిడ్నాప్‌చేసి హత్య చేశారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపానని చెప్పారు. ఆ తర్వాత మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.
డ్రగ్ మాఫియాకు చెందిన సభ్యులు కనిపిస్తే కాల్చివేయమని ప్రజలకు డూటర్టీ నేరుగా పిలుపునిచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో చట్ట విరుద్ధంగా డ్రగ్ మాఫియా పేరిట ఆరువేల మంది హత్యలకు గురయ్యారు. వారిలో కొంత మందిని పోలీసులు కాల్చి చంపగా, మిగతా వారిని ప్రజలే కాల్చి చంపారు.