‘ట్రంప్ వచ్చాడు... ఇక అమెరికాతో గొడవ పడం’
మనీలా: అమెరికాతో కయ్యాలు మానుకుంటామని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా డుటెర్టె తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని, బరాక్ ఒబామా నరకానికిపోతాడని గతంలో దుయ్యబట్టారు.
కౌలాలంపూర్ లో ఫిలిప్పీన్స్ వాసులను ఉద్దేశించి డుటెర్టె బుధవారం ప్రసంగించారు. ‘అమెరికాతో ఇక గొడవ పడాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఉన్నార’ని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు ఆయన అభినందనలు తెలిపారు. తమ ఇద్దరికీ చాలా విషయాల్లో సామీప్యం ఉందని, ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. విమర్శలు చేయడంలో తామిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచి ట్రంప్ ను డుటెర్టె సమర్థిస్తూ వచ్చారు. ట్రంప్ ను ముద్దుగా ‘ట్రంప్ ఆఫ్ ది ఈస్ట్’ సంబోధించారు.