ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వాగ్వాదం
కేంద్రం చర్య రాజ్యాంగ విరుద్ధమన్న పాల్వాయి, టీఆర్‌ఎస్ ఎంపీ కేకే
పరిష్కారమైన అంశాన్ని మళ్లీ లేవనెత్తరాదంటూ అడ్డుకున్న జేడీ శీలం
కాసేపు సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోకి బదలాయిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుపై మంగళవారం రాజ్యసభలో ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ ఆర్డినెన్సును చట్టంగా రూపొందించే ప్రయత్నాలను ఏపీ కాంగ్రెస్ ఎంపీలు సమర్థించగా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ముంపు మండలాలను ఏపీకి ఎలా బదలాయిస్తారని... ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు.
అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం జోక్యం చేసుకుని ఈ అంశాన్ని లేవనెత్తడానికి రాజ్యసభ వేదిక కాదన్నారు. పరిష్కారమైన అంశాన్ని తిరిగి లేవనెత్తరాదన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ ఆర్డినెన్సు ద్వారా ముంపు మండలాల బదలాయింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. వాగ్వాదానికి దిగిన ఎంపీలకు సర్దిచెప్పడానికి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఎంత ప్రయత్నించినా సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశం ప్రశాంతంగా కొనసాగింది.
ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలి: కవిత
పోలవరం ముంపు మండలాలను ఏపీలోకి చేరుస్తూ తెచ్చిన ఆర్డినెన్సు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముంపు మండలాల విలీనం తెలంగాణ, ఏపీ సమస్య మాత్రమే కాదని, ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారాన్ని చూపాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ఆమె మాట్లాడారు. పోలవరం కోసం 60 ఏళ్లలో ఎన్నోసార్లు టెండర్లు పిలిచినా గిరిజనుల ఆందోళనలతో అవన్నీ రద్దయ్యాయని గుర్తు చేశారు. ముంపు మండలాలను విలీనం చేయ డం అవమసరమనుకుంటే సభలో చర్చకు పెట్టాలని సూచించా రు. రాష్ట్రాల సరిహద్దులు, పేర్లుమార్చేందుకు, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారం కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను ఉపయోగించుకొని కేంద్రం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్డినెన్సు ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను మార్చిందన్నారు. ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపితే భవిష్యత్‌లో ఆర్డినెన్సుల ద్వారా రాష్ట్రాల హద్దులను, పేర్లను మార్చుకోవడంపై పెద్ద సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు రాష్ట్రపతి ప్రసంగంలో శుభాకాంక్షలు తెల పకపోవడం తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు.
హిమాచల్ మృతుల కుటుంబాలకు సంతాపం
హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జి డ్యామ్ నీటి ప్రవాహంలో గల్లంతై మృతిచెందిన రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలకు పార్లమెంటు ఉభయ సభలు సంతాపం, సానుభూతిని ప్రకటించాయి.