అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తి 14 ఏళ్ల ముస్లిం బాలిక హిజాబ్‌ను చించేస్తూ, ఆమె ఉగ్రవాది అని ఆరిచిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు సోమవారం రాత్రి అట్లాంటాలోని ఓ మాల్ వద్ద మరికొందరితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం వెతుకున్నట్లు డన్‌వూడీ పోలీసులు తెలిపారు. పౌరులందరి రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతామని డన్‌వూడీ పోలీస్ చీఫ్ బిల్లీ గ్రోగాన్ చెప్పారు. ఈ సంఘటనను దాడిగానే భావిస్తున్నామని పేర్కొన్నారు.
నిందితుడి గురించి సమాచారం ఇచ్చే వారికి అమెరికన్–ఇస్లామిక్ సంబంధాల మండలి జార్జియా చాప్టర్(సీఏఐఆర్–జార్జియా) వేయి డాలర్ల నజరానా ప్రకటించింది. ఆ వ్యక్తి ముందుకొచ్చి క్షమాపణ చెబితే అతనిపై ఎలాంటి కేసు పెట్టమని బాలిక కుటుంబం తెలిపింది. అమెరికాలో హిజాబ్ ధరించిన మహిళలు లక్ష్యంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం.