మీకిక రాజకీయ సమాధే!
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీ నామా చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములవ్వాలని, ఈ పని చేయకుండా ఉద్యమానికి తూట్లు పొడవాలని చూస్తే.. వారికి రాజకీయ సమాధి తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు రాజీనామా చేశారని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
రాజీనామా చేశామని కొందరు ప్రకటనలు చేస్తున్నారేగానీ, తమ రాజీనామా పత్రాల్ని ప్రధానికి పంపలేదన్నారు. రాజీనామాలు చేశామంటూ ఢిల్లీలో కూర్చొని డ్రామాలాడుతున్న నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజీనామాలు సమర్పించి ప్రజా ఉద్యమంలోకి రాకుంటే ఇకపై.. వారి చరిత్ర చీకట్లోనేనని మండిపడ్డారు. కేబినెట్ భేటీలో టీ నోట్‌ను ఇద్దరు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించినా కేంద్రం లెక్కచేయలేదంటే ఆంధ్రప్రదేశ్ నేతల దుస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఉండాలో, పదవులు వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలో ఇప్పటికైనా తేల్చుకోవాలని సూచిం చారు.
చిరుద్యోగులు 60 రోజులుగా జీతాల్లేకుండా సమ్మె చేస్తూ ఉద్యమాన్ని నడుపుతుంటే.. కొందరు నేతలు పదవులకోసం సోనియాగాంధీ వద్ద మోకరిల్లుతుండడం దౌర్భాగ్యమన్నారు. విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల ప్రజలకు ప్రమాణ పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వనివారిని ద్రోహులుగానే పరిగణిస్తామన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాం ధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలకోసం రాజకీయ నేతలు రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం దురదృష్టకరమన్నారు. తెలంగాణపై నోట్‌కు కేబినెట్ ఆమోదం లభించినంత మాత్రాన విభజన జరిగిపోయినట్లు కాదని, కేబినెట్ ఆమోదం తెలపడం కూడా సీడబ్ల్యూసీ నిర్ణయం వంటిదేనన్నారు. కేబినెట్ నిర్ణయంపై సమైక్యవాదులు ఆందోళన చెందనక్కర్లేదన్నారు.
ఉద్యమాన్ని, హింస కు తావులేకుండా మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కడప, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారినట్లు తమ దృష్టికొచ్చిందని, అయితే హింసాత్మక ఘటనలు రాజకీయ ప్రేరితమైనవేగాని, ఉద్యోగులకు సంబంధం లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో విషాదకర సంఘటనగా మిగిలిపోతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. ఒక అంశంపై రాష్ట్ర ప్రజలంతా బాధపడిన సంఘటన ఇదేనన్నారు. కొన్ని పార్టీలు సమైక్యాంధ్ర నినాదంతో ముందుకెళుతున్నా.. ఉద్యోగులందరం ఒంటరిగానే పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. దీనిపై 6న జరిగే ఉద్యోగ సంఘాల భేటీలో నిర్ణయిస్తామన్నారు. కేబినెట్ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సులు, విద్యుత్ ఉద్యోగులు తదితర అత్యవసర విభాగాల ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కేంద్రానికి తాకేలా, వేలాది మంది ఉద్యోగులతో ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.