దినకరన్ పై ముప్పేట దాడి
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల కోసం ఎన్నికల అధికారికి లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పై జాతీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమిళనాడు రాజకీయాలకు దిగజార్చారని ధ్వజమెత్తారు. దినకరన్ చర్యను ముక్తకంఠంతో ఖండించారు. ఆయనను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
‘ఎన్నికల అధికారికి దినకరన్ లంచం ఇవ్వజూపారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా తక్కువ సమయంలోనే తమిళ రాజకీయాలను దినకరన్ అథమస్థాయికి దిగజార్చార’ని బీజేపీ నాయకుడు ఎస్. ప్రకాశ్ ఆక్షేపించారు. తమ తప్పును తెలుసుకున్న అన్నాడీఎంకే ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంతో విలీన చర్చలు జరుపుతోందని తెలిపారు.
‘తమిళ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు విలీన చర్చలు జరుపుతున్నాయి. తాజా పరిణామాలను కనిపెట్టి చూస్తున్నాం. దినకరన్ ను అరెస్ట్ చేసి విచారించాలి. చట్టపరంగా చర్యలు చేపట్టాల’ని సీపీఐ సీనియర్ నేత డి.రాజా డిమాండ్ చేశారు.
దినకరన్ పై వచ్చిన నిజమైతే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేత మజీద్ మెమన్ అన్నారు. ఇటువంటి చర్యలకు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు.