చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: చెరువులు, చెరువు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచి స్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. సాగునీటి రంగ అభివృద్ధికి సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎంకేఎస్‌వై పథకం కింద తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేశామని, ఈ జిల్లాల సాగునీటి విధానంతో పాటు, వ్యవసాయ విధానం కూడా కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో రూ.1,024 కోట్ల అంచనా వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పాలకుల వల్లే రైతులకు కష్టాలు..
కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే రైతుల కష్టాలు కొనసాగుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. కట్టలుంటే కాలువలుండవు.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిహారం పంపిణీ చేశామని అన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని పునరుద్ఘాటించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, పనులు చేసేందుకు ముందుకురాని చోట్ల కాంట్రాక్టర్లను మార్చి కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు.
‘పెన్‌గంగ’ ద్వారా 50వేల ఎకరాలకు నీరు..
పెన్‌గంగపై తలపెట్టిన బ్యారేజీ నిర్మాణ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, 50వేల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులకు మరింత జలకళ వచ్చేలా చూస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడాం నగేష్, కలెక్టర్ ఎం.జగన్మోహన్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.