'ఆ నిర్ణయం మా ప్రభుత్వానిది కాదు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించే విషయంలో విభజన చట్టంప్రకారమే తాము నడుచుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై లోక్సభలో కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సెక్షన్ 8 కింద ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయని తెలిపారు. విజభన బిల్లును యూపీఏ ప్రభుత్వం చేసిందని, తాము కాదని ఆయన స్పష్టం చేశారు.
గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలన్నది తమ నిర్ణయం కాదని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రుల రక్షణ బాధ్యత గవర్నర్దేనని చట్టంలో ఉందని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ కేబినెట్ అభిప్రాయం తీసుకుని గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తారని వివరించారు. రాజ్నాథ్ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చూస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు.