ఒబామాను బూతుమాటతో తిట్టి..
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నోరు పారేసుకున్నారు. ఒబామాను ఉద్దేశించి బూతుమాటలతో తిట్టారు. ఒబామా ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఒబామా రోడ్రిగోతో తలపెట్టిన తన తొలి సమావేశాన్ని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. లావోస్‌లో దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు సందర్భంగా తొలిసారి ఫిలిపినో అధ్యక్షుడు రోడ్రిగో- ఒబామా భేటీకి గతంలో షెడ్యూల్ ఖరారైంది.
చైనాలోని హాంగ్‌ఝౌలో జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ఒబామా తన గురించి రోడ్రిగో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యల గురించి తెలియగానే తన భేటీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోపాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రోడ్రిగో ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆర్షించిన సంగతి తెలిసిందే.
వైట్‌హౌస్ సిబ్బంది ద్వారా రోడ్రిగో వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఒబామా.. ఆయనతో సమావేశం దండుగ అనే నిర్ణయానికి వచ్చారు. తాము ఎవరితోనైనా చర్చలు జరిపితే.. అవి నిర్మాణాత్మకంగా, ప్రతిఫలం ఇచ్చేవిగా ఉండాలని కోరుకుంటున్నామని ఒబామా చెప్పారు. వియత్నాం రాజధాని హనోయ్ వచ్చిన ఒబామా.. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జియున్-హైతో భేటీ అయ్యే అవకాశముంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలపై వీరు ప్రధానంగా చర్చించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు వియత్నాం రావడం ఇదే తొలిసారి. కాగా, ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిలిపినో అధ్యక్షుడు రోడ్రిగో విచారం వ్యక్తం చేశారు.