
న్యాయసలహాకు టీ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013పై రాష్ట్రపతి ప్రణబ్ ము ఖర్జీ న్యాయ సలహాను కోరారు. రాష్ట్రపతి భవన్‌లోని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేర కు బిల్లులో పొందుపరిచిన అం శాలపై అభిప్రాయాన్ని చెప్పమంటూ ప్రణబ్ న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు. వారు మంగళ, బుధవారాల్లో తమ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలిపే అవకాశం ఉంది. విభజన వ్యవహారంలో కేంద్రం తీరును ఆక్షేపిస్తూ పలువురు తనకు వినతిపత్రాలు అందించిన నేపథ్యంలో.. న్యాయ, రాజ్యాంగ నిపుణులను రాష్ట్రపతి సంప్రదించారు.
వాస్తవానికి ఈ బిల్లును రాష్ర్టపతి సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్రానికి పంపించవచ్చని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. గత గురువారం రాత్రి కేబినెట్ ఆమోదం లభించిన తరువాత విభజన బిల్లు అన్ని లాంఛనాలు పూర్తిచేసుకుని శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నమే ప్రణబ్ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. బెంగాల్‌నుంచి తిరిగొచ్చిన తరువాత ఆదివారం విభజన బిల్లు రాష్ట్రపతి ముందుకు వచ్చింది.
దీన్ని పరిశీలించిన ప్రణబ్.. దానిపై న్యాయ సలహా కోరడం మంచిదని భావించి ఆ మేరకు నిపుణులను సంప్రదించారని సమాచారం. విభజన బిల్లును ప్రణబ్ సోమవారం అసెంబ్లీకి పంపవచ్చని మంత్రుల బృందం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ శనివారం విలేకరులతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా రాష్ట్రపతి ఆ బిల్లును న్యాయ పరిశీలనకు పంపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లు విషయంలో తననెవరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతోనే ఆయన నిపుణుల సలహాను కోరారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన గతంలో జరిగిన రాష్ట్రాల విభజనలకు పూర్తి భిన్నమైనది అయినందువల్ల.. ఎలాంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి న్యాయ నిపుణులను సంప్రదించారని అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీకిచ్చే గడువెన్ని రోజులు: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళి అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సోమవారం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లింది. వారు బుధవారం ఢిల్లీకి తిరిగి రానున్నారు. ఆ తరువాతే విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ లోగా న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం కూడా రాష్ట్రపతికి చేరుతుంది కాబట్టి అన్నీ పరిశీలించి ఆయన బిల్లుపై ఓ అభిప్రాయానికి వస్తారని భావిస్తున్నారు. అప్పుడే అసెంబ్లీకి ఎంత సమయం ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఆ తరువాతే రాష్ర్ట అసెంబ్లీ అభిప్రాయం కోరుతూ బిల్లును పంపిస్తారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. బిల్లును తిరిగి పంపించేందుకు అసెంబ్లీకి రాష్ట్రపతి ఎన్ని రోజులు గడవు ఇస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటే గడవు ఎక్కువగా ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, సంప్రదాయాల ప్రకారం వెళ్తే 40 రోజుల వ్యవధినిచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.