'టి' బిల్లుని ప్రణబ్ తిరస్కరిస్తారా? | President Pranab Mukherjee may turn down Telangana Bill? | Sakshi
Sakshi News home page

'టి' బిల్లుని ప్రణబ్ తిరస్కరిస్తారా?

Published Fri, Nov 8 2013 3:05 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'టి' బిల్లుని ప్రణబ్  తిరస్కరిస్తారా? - Sakshi

'టి' బిల్లుని ప్రణబ్ తిరస్కరిస్తారా?

అన్ని అడుగులూ వడివడిగా విభజన దిశగానే పడుతున్నప్పటికీ, ఇటీవల అనుకోకుండా హైదరాబాదు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సమైక్యవాదుల్లో కొత్త ఆశలు మోసులెత్తించారు. తెలంగాణ బిల్లు మీద ఆయన రాజ్యాంగపరమైన అభ్యంతరాలు తెలియజేసే అవకాశముందని సూచనలు అందినట్టు సమైక్యవాదులు చెబుతున్నారు.

తనంత స్థాయి వారు రావాల్సినంత ప్రాధాన్యతలేని కార్యక్రమాంలో పాల్గోడానికి వచ్చినప్పటికీ, రాష్ట్రపతి ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాన్ని మరింత చేరువగా అర్థం చేసుకోవడానికి వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం అడుగులకి మడుగులొత్తుతూనే, మరో పక్క సమైక్య మాస్కుని ధరించి ద్విపాత్రాభినయం చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖపై కేంద్రాన్ని వివరణ కోరి, సమైక్యవాదులకి నైతిక బలాన్ని అందించిన ప్రణబ్ ముఖర్జీ, తన అనూహ్య రాకతో మరింత బలమిచ్చారంటున్నారు.

రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తానని, తానే గాక, కేంద్ర కేబినెట్ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన ఇటీవల హైదరాబాదులో తనని కలిసిన అన్ని పార్టీల నేతలకీ స్పష్టం చేశారు. ఆయన హఠాత్తుగా రాష్ట్ర రాజధానికి రావడం, రాజ్ భవన్‌లో తనని కలిసేందుకు వరస కట్టిన ప్రతి పార్టీ నాయకులు చెప్పింది సావధానంగా వినడం రాజకీయ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన పరోక్షంగా చేసిన సూచనలు సమైక్యవాదానికి దన్నుగానే ఉన్నాయని ఆ సమావేశాలలో పాల్గొన్న నాయకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన, తదనంతర పరిణామాల గురించి ప్రస్తావిస్తూ విభజన ప్రతిపాదన గురించి సోనియాను ప్రణబ్ ముఖర్జీ  హెచ్చరించినట్లు కొన్ని జాతీయ పత్రికలు వార్తలు ప్రచురించిన నేపథ్యంలో, ఆయన రాష్ట్ర విభజనని తిరస్కరిస్తారని ఊహిస్తున్నారు.  తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లినప్పుడు,  ఆర్టికల్ 371(డి) దృష్ట్యా బిల్లు పై అభ్యంతరం పెట్టే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ని సవరిస్తేనేగానీ రాష్ట్ర విభజనకు వీలు కాదని రాజ్యాంగ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ అధికరణ దానంతట అదే రద్దైపోతుందని చేస్తున్న వాదన తప్పని నిపుణులు చెబుతున్నారు. 371(డి)లో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా, రాష్ట్ర విభజన సాధ్యం కాదని వారి వాదం. ఆర్టికల్ 371(డి)ని 7వ షెడ్యూలులో చేర్చినందువల్ల, దానిని సవరించకుండా తెలంగాణ ప్రక్రియలో ముందుకు పోలేమని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అధికరణ ప్రకారం తెలంగాణని ఏర్పాటు చేయొచ్చని కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రపతి దగ్గర రాజ్యంగపరంగా భంగపడే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, ఆర్టికల్ 371(డి)ని సవరించాలంటే, పార్లమెంటు ఆమోదం పొందాలి, దానికి కనీసం 50 శాతం కోరంలో మూడింట రెండొంతులు సవరణకి మద్దతునివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పుడల్లా పూర్తయ్యే అవకాశమే లేదని, మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల ముందు రాష్ట్ర విభజన అసాధ్యమని అంటున్నారు. బెంగాల్ విభజన సృష్టించిన గాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర విభజనపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవదీసి, విభజన ప్రక్రియకి కళ్లేలు వేయవచ్చని విశ్లేషకుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement