
'భారతరత్న' కోసం ప్రోటోకాల్ పక్కకు..
మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రోటోకాల్ను పక్కన పెట్టనున్నారు. మార్చి 27న రాష్ట్రపతి స్వయంగా వాజపేయి నివాసానికి వెళ్లి దేశ అత్యున్నత అవార్డును ప్రదానం చేయనున్నట్లు బుధవారం రాష్ట్రపతి భవన్ మీడియా వ్యవహారాల ప్రతినిధులు వెల్లడించారు.
రెండు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థికాభివృద్ధిలో తనదైన ముద్రవేసిన వాజపేయి, స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్యను భారత రత్న పురస్కారాన్ని ఎంపికయినట్లు గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత రత్న అవార్డుకు ఎంపికయిన ప్రధానుల్లో అటల్ ఏడో వ్యక్తి. గతంలో ప్రధానులుగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నందా ఈ పురస్కారాన్ని పొందారు.