ఛాన్స్ ఎవరికో?
ఉమ్మడి అభ్యర్థిపై రేపు విపక్షాల మంతనాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలపై విపక్షాలు శుక్రవారం మంతనాలు జరపనున్నాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇవ్వనున్న విందులో నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెస్‌లో జరిగే అవకాశమున్న ఈ విందులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), బిహార్ సీఎం నితీశ్ కమార్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ) తదితరులతోపాటు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశమున్న జేడీయూ నేత శరద్ యాదవ్ కూడా హాజరు కానున్నారు.
జేడీయూ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, తృణమూల్ తదితర పార్టీలకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మమత శుక్రవారం సోనియాను విడిగా కలిసే అవకాశముంది. విపక్షాల అభ్యర్థి రేసులో మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరుల పేర్లు వినిపిస్తుండటం తెలిసిందే.