joint candidate
-
Lok Sabha elections 2024: కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్ బరిలో దిగనుంది. చాంద్నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్లో రెండు స్థానాలను ఆప్కే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్‌లో ఆప్ పోటీచేయనుంది. గుజరాత్‌లోని భరూచ్ స్థానం నుంచి ఆప్ నేత ఛైతర్ వసావా, భావ్‌నగర్‌లో ఉమేశ్‌భాయ్ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్ ప్రకటించింది. -
‘ఇండియా’లో లోక్‌సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం
ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అయితే, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. -
Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించే దిశగా ప్రయత్నాలకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పదును పెడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు విపక్ష నేతలతో వరుస సంప్రదింపులు జరిపిన ఆమె, వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖర్గే తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆమెతో పాటు డీఎంకే నేత తిరుచి శివ, ఆప్ నేత సంజయ్ సింగ్‌తో పాటు వామపక్షాల నేతలకు కూడా ఆయన ఫోన్లు చేశారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఖర్గే చర్చించనున్నారు. ఆయన చర్చల సందర్భంగా ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయానికి మమత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. దీనిపై త్వరలో ప్రాంతీయ పార్టీలతో సంయుక్త సమావేశం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే గురువారమే ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి ఈ విషయమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు పవార్ కూడా సానుకూలమేనని ఖర్గే అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేడీ అనుసరించబోయే వైఖరిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వాటితో చర్చలకు కాంగ్రెసేతర నేతలను పురమాయించాలన్న యోచన కూడా ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న తృణమూల్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉండటం ఏకాభిప్రాయ సాధన ప్రయత్నాలకు అడ్డంకిగా కన్పిస్తోంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసేతర నేతను బరిలో దించాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ‘ఒక్క’ శాతంపై బీజేపీ దృష్టి రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన 1.1 శాతం ఓట్లపై బీజేపీ కూడా దృష్టి సారించింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల మొత్తం ఓట్ల విలువ 10.86 లక్షల్లో బీజేపీకి 48.9 శాతం ఉన్నాయి. దాంతో మిగతా 11,990 ఓట్ల కోసం ప్రాంతీయ పార్టీలను బీజేపీ సంప్రదిస్తోంది. ముఖ్యంగా బిజూ జనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే ఆ పార్టీల చీఫ్‌లు నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఎలక్టోరల్ కాలేజీలో బీజేడీకి 13 వేల పై చిలుకు, వైఎస్సార్సీపీకి 45 వేల పై చిలుకు ఓట్లున్నాయి. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతూ తమకేనని బీజేపీ అంటోంది. ఆయనతోనూ చర్చలకు ప్రత్యేక బృందాన్ని పంపనుంది. -
బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థి!
న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో భిన్న వ్యూహాలు అమలుచేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని స్థానాల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టబోతున్నట్లు సంకేతాలిచ్చింది. రాబోయే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు కసరత్తును ప్రారంభించిన ఆ పార్టీ..ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అనధికార చర్చలు ప్రారంభించింది. పార్టీ విశ్వసనీయ వర్గాల ప్రకారం..ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీలు ప్రతి నియోజకవర్గంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని గుర్తిస్తాయని తెలిసింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ బేషజాలకు పోకూడదని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. -
ఛాన్స్ ఎవరికో?
ఉమ్మడి అభ్యర్థిపై రేపు విపక్షాల మంతనాలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలపై విపక్షాలు శుక్రవారం మంతనాలు జరపనున్నాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇవ్వనున్న విందులో నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెస్‌లో జరిగే అవకాశమున్న ఈ విందులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), బిహార్ సీఎం నితీశ్ కమార్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ) తదితరులతోపాటు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశమున్న జేడీయూ నేత శరద్ యాదవ్ కూడా హాజరు కానున్నారు. జేడీయూ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, తృణమూల్ తదితర పార్టీలకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మమత శుక్రవారం సోనియాను విడిగా కలిసే అవకాశముంది. విపక్షాల అభ్యర్థి రేసులో మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరుల పేర్లు వినిపిస్తుండటం తెలిసిందే. -
ఐదో ఎమ్మెల్సీ సీటుకు టీఆర్ఎస్ దూరం!
* నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకోవాలని యోచన * అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధత * తెరపైకి దేవీప్రసాద్ పేరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు (ఎమ్మెల్యే కోటాలో) జూన్ 1న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనున్నా టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం నాలుగు ఎమ్మెల్సీ పదవులను టీఆర్ఎస్ సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు స్థానాలను మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావులకు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుండగా మరో రెండు సీట్లలో మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై అధినాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయంకాగా టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి మాత్రం రెండు ఓట్లు తక్కువ అవుతున్నాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఐదో ఎమ్మెల్సీ కోసం అభ్యర్థిని బరిలోకి దింపడమా, మానడమా అనే విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు తేలిగ్గా వచ్చే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో సరిపెట్టుకోవాలని, ఐదో ఎమ్మెల్సీ కోసం పోటీకి దిగి రిస్కు తీసుకోదలచుకోలేదని తెలుస్తోంది. ఈ లెక్కన టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటున్నట్లేనని అనుకుంటున్నారు. దీంతో ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. 20వ తేదీ లోగా పేర్ల ఖరారు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన టీఎన్జీవోల మాజీ నేత దేవీప్రసాద్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. అయితే దీనిపై కేసీఆర్ ఇంకా తన నిర్ణయాన్ని బయట పెట్టలేదు. గవర్నర్ కోటాలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను కూడా ఎమ్మెల్యే కోటాలోనే సర్దుతారని తెలుస్తోంది. వీరి పేర్లు ఒకవేళ ఖాయమైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎ.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన బోడకుంటి వెంకటేశ్వర్లు వంటి నేతలకు ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్నలకు పార్టీ వర్గాల వద్ద సమాధానం లేదు. మరోవైపు తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన న్యాయవాదులకూ గుర్తింపు ఇవ్వాలని, జేఏసీ కో కన్వీనర్‌గా ఉన్న న్యాయవాది శ్రీరంగారావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని న్యాయవాద సంఘాల నేతలు ఆదివారం సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. అభ్యర్థిత్వాల ఖరారు ఆలస్యమయ్యేకొద్దీ కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని, ఈనెల 19, 20 తేదీల్లో నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.