Gopal Krishna Gandhi
-
గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష్ణ గాంధీ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన వెంట వచ్చారు. రాజ్యసభ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తదితర ప్రముఖులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. 18 ప్రతిపక్ష పార్టీలు గోపాలకృష్ణ గాంధీకి మద్దతు ఇచ్చాయి. అంతకుముందు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ పోటీలో నిలబడడంతో పోలింగ్ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 21 చివరి తేది. -
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
న్యూఢిల్లీ: మహాత్మ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో 18 విపక్ష పార్టీలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని గోపాలకృష్ణ గాంధీని కలిసి ప్రతిపక్ష పార్టీలు కోనున్నాయి. ఈ నిర్ణయంతో జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకీభవిస్తాయని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని నితీశ్ ఆకాంక్షించారు. అయితే విపక్ష పార్టీల కూటమి మీరా కుమార్‌ను పోటీకి పెట్టడంతో ఆయన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వంపై నితీశ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సివుంది. ఐఏఎస్‌గా పదవీ విరమణ చేసిన గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా..నార్వే, ఐలాండ్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 1946, ఏప్రిల్ 22న జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఎమ్మే ఇంగ్లీషు అభ్యసించారు. 1968లో ఐఏఎస్ అధికారిగా చేరారు. 2004, డిసెంబర్లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009 వరకు గవర్నర్‌గా పనిచేశారు. -
ఛాన్స్ ఎవరికో?
ఉమ్మడి అభ్యర్థిపై రేపు విపక్షాల మంతనాలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలపై విపక్షాలు శుక్రవారం మంతనాలు జరపనున్నాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇవ్వనున్న విందులో నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెస్‌లో జరిగే అవకాశమున్న ఈ విందులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), బిహార్ సీఎం నితీశ్ కమార్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ) తదితరులతోపాటు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశమున్న జేడీయూ నేత శరద్ యాదవ్ కూడా హాజరు కానున్నారు. జేడీయూ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, తృణమూల్ తదితర పార్టీలకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మమత శుక్రవారం సోనియాను విడిగా కలిసే అవకాశముంది. విపక్షాల అభ్యర్థి రేసులో మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరుల పేర్లు వినిపిస్తుండటం తెలిసిందే.