
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
న్యూఢిల్లీ: మహాత్మ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో 18 విపక్ష పార్టీలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని గోపాలకృష్ణ గాంధీని కలిసి ప్రతిపక్ష పార్టీలు కోనున్నాయి.
ఈ నిర్ణయంతో జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకీభవిస్తాయని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని నితీశ్ ఆకాంక్షించారు. అయితే విపక్ష పార్టీల కూటమి మీరా కుమార్‌ను పోటీకి పెట్టడంతో ఆయన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వంపై నితీశ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సివుంది.
ఐఏఎస్‌గా పదవీ విరమణ చేసిన గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా..నార్వే, ఐలాండ్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 1946, ఏప్రిల్ 22న జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఎమ్మే ఇంగ్లీషు అభ్యసించారు. 1968లో ఐఏఎస్ అధికారిగా చేరారు. 2004, డిసెంబర్‌లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009 వరకు గవర్నర్‌గా పనిచేశారు.