జపాన్‌తో అణు ఒప్పందం!
ఆ దేశ ప్రధానితో నేడు మోదీ భేటీ
కీలక అంశాలపై చర్చలు.. ఒప్పందాలు
టోక్యో/బ్యాంకాక్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్ ప్రధాని షింజో అబెతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. అనంతరం ఇరు దేశాలు 12 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అలాగే కీలకమైన పౌర అణు ఒప్పందం కూడా జరగనున్నట్లు తెలిసింది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు ఇప్పటికే చివరి దశకు వచ్చాయి. మోదీ, అబెలు భౌగోళిక ప్రాంతాలు, రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యోలో, శనివారం కోబేలో జపాన్ వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ‘భారత్, జపాన్‌కు చెందిన అత్యున్నత వ్యాపారవేత్తలతో పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొనబోతున్నా.
దీని ద్వారా వాణిజ్య, పెట్టుబడుల్లో మా బంధం మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు. జపాన్ చక్రవర్తి అకిహిటోతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆ దేశ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు. థాయ్‌లో ఆకస్మిక పర్యటన: థాయ్‌లాండ్ దివంగత రాజు భుమిబోల్ అదుల్యాదేజ్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. జపాన్ పర్యటనకు బయలుదేరిన మోదీ మర్గమధ్యలో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆకస్మికంగా దిగి, గ్రాండ్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో దివంగత రాజుకు శ్రద్ధాంజలి ఘటించారు. వృద్ధాప్యం వల్ల గత నెలలో రాజు మృతి చెందారు.